సచివాలయాన్ని కూల్చొద్దు

2 Oct, 2019 03:25 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..

కేసులు పెండింగ్‌లో ఉండగా కూల్చివేత సరికాదు

దసరా సెలవుల తర్వాత పిటిషన్లు విచారిస్తామన్న ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర సచివాలయాన్ని కూల్చొద్దని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టులో కేసులు విచారణలో ఉన్నందున కూల్చివేయరాదని, ఈ విషయాన్ని ప్రభుత్వా నికి తెలియజేయాలని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌కు ధర్మాసనం సూచిం చింది. కోర్టులో విచారణలో ఉండగా ప్రభుత్వం కూల్చివేత చర్యలు తీసు కుంటే అది న్యాయ ప్రక్రియలో జోక్యమే అవుతుందని వ్యాఖ్యానిం చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ. అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. 

సచివాలయ భవనాలను కూల్చేయాలనే నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ ప్రొఫెసర్‌ విశ్వేశ్వర్‌ రావు, సామాజిక కార్యకర్త ఒ.ఎం. దేబ్ర, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇతరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను విచా రించాలని ధర్మాసనాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోరారు. కేబినెట్‌ భేటీలో సచి వాలయ భవనాల కూల్చివేత అంశంపై నిర్ణ యం తీసుకోనుందని, దసరా సెలవుల నేపథ్యంలో కూల్చివేత ప్రారంభించే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల దృష్ట్యా పిల్స్‌ను విచా రించాలన్నారు. అయితే భోజన విరామ సమ యం తర్వాత విచారిస్తామని ధర్మాసనం తెలి పింది. 

కానీ మున్సిపల్‌ ఎన్నికల పిల్స్‌పై మధ్యాహ్నమంతా వాదనలు జరగడం, కోర్టు సమయం ముగియడంతో సచివాలయ భవ నాలపై పిల్స్‌ను దసరా సెలవుల తర్వాత విచా రిస్తామని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 14న పిల్స్‌పై విచారణ జరుపుతామని, ఈలోగా భవన సముదాయాన్ని కూల్చివేయరాదని ఆదే శించింది. అంతకుముందు అడ్వొ కేట్‌ జనరల్‌ వాదిస్తూ.. సచివాలయంలో అన్ని కార్యాల యాలను ఇతర భవనాల్లోకి మార్పు చేశామని తెలిపారు. దీనిపై ధర్మాస నం స్పందిస్తూ ఆ కార్యాలయాలను అక్కడే కొనసాగించవచ్చునని, తిరిగి సచివాలయంలోకి మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది.

సంప్రదాయ విధానం ద్వారానే..
సచివాలయ భవనాల కూల్చివేతను సంప్రదాయ విధానంలో మనుషులను వినియోగించి పూర్తిచేయడమే ఉత్తమమని అధికారులు తాజాగా భావిస్తున్నట్లు సమాచారం. సంప్రదాయ పద్ధతిలో అన్ని భవనాలను కూల్చి నేలను చదును చేసేందుకు నెల రోజుల సమయం పడుతుందని, పైగా పాత భవనాల స్టీల్, ఇతర వస్తువులను పునర్వినియోగానికి వాడొచ్చని అధికారులు అంటున్నారు. తొలుత ఇంప్లోజివ్‌ విధానంలో కూలుద్దామని భావించినా భవనాలను ఇప్పటివరకు అలా విజయవంతంగా కూల్చిన దాఖలాలు లేవని, దాని ఫలితాలపై అంచనా కూడా లేదని చెబుతున్నారు. 

ఆ విధానాన్ని అనుసరిస్తే ఖర్చు కూడా చాలా ఎక్కువగా అవుతుందని, దాని నిపుణులు స్థానికంగా లేనందున వారిని ఇతర ప్రాంతాల నుంచి రప్పించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. అందువల్ల సంప్రదాయ కూల్చివేత విధానమే ఉత్తమమనేది అధికారుల మాట. అయితే ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా