ఆరోగ్యశ్రీ ద్వారా కరోనాకు వైద్యం చేస్తున్నారా? 

19 Apr, 2020 08:35 IST|Sakshi

వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా వైద్యపరీక్షలు, వైద్యం చేస్తున్నదీ లేనిదీ ఈ నెల 22 నాటికి వివరించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయ మూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా ఉచితంగా నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది పి.తిరుమలరావు రాసిన లేఖను తెలంగాణ  హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది.

కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజ న పథకం కింద కరోనా వైద్య పరీక్షలకు మార్గదర్శకాలు జారీచేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆ మార్గదర్శకాలను అమలు చేయకుండా సొంతంగా పథకాన్ని అమలు చేస్తోందన్నారు. దీనికి  ధర్మాసనం స్పం దిస్తూ, రెడ్‌ జోన్స్‌ ఎక్కువ అవుతున్నాయని, అలాంటి ప్రాంతాల్లోని వారికి వైద్యం ఎలా చేస్తారని ప్రశ్నించింది. 37 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సివుంటే 67 వేల కిట్‌లు మాత్రమే ఉన్నాయని, భారీగా లక్షల కిట్లను ఎలా సమకూర్చుతారని కూడా ప్రశ్నించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద పరీక్షలు చేస్తున్నదీ లేనిదీ తెలుసుకుని తమకు వివరించాలని అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు