ధరలు దరువేస్తుంటే దర్జాగా చూస్తుంటారా?

22 May, 2020 02:52 IST|Sakshi

ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ వేళ ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులు సరసమైన ధరలకు అందేలా చూడాల్సిన బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ధరల్ని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, విపత్కర పరిస్థితుల్లో ప్రజలు దోపిడీకి గురికాకూడదని, ఈ బాధ్యతను ప్రభుత్వం విస్మరించకూడదని వ్యాఖ్యానించింది. ధరల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవంది. ధరల్ని అదుపు చేసే విషయాన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకున్నట్లుగా ఉందని చెప్పడానికి.. జంట నగరాల్లో 290 కేసులు మాత్రమే నమోదు చేసినట్లుగా ప్రభుత్వ నివేదిక నిదర్శనమని పేర్కొంది.

రాష్ట్ర వ్యాప్తంగా అధిక ధరలను అదుపు చేయాలని ఆదేశించింది. ధరలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను ఈ నెల 26 నాటికి సమర్పించాలని, తదుపరి విచారణను ఈ నెల 27న జరుపుతామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాç Üనం ఉత్తర్వులు జారీ చేసింది. నిత్యావసరాల ధరలు పెరిగాయని పత్రికల  వార్తా కథనాన్ని పిల్‌గా పరిగణించి గురువారం మరోసారి విచారణ జరిపింది.

కిలో కందిపప్పు రూ.200 ఎందుకుంది? 
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అధిక ధరలకు విక్రయాలు చేసే వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారని చెప్పారు. జంటనగరాల్లో అధిక ధరలకు విక్రయించే వారిపై 290 కేసులు నమోదు చేశారని తెలిపారు.  దీనికి ధర్మాసనం స్పందిస్తూ..ఇళ్లకే పరిమితమైన పేద, మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించాలని ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు