సగం వేతనాలు.. ధరలకు రెక్కలు

9 May, 2020 03:24 IST|Sakshi

జనం ఎట్లా బతుకుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

అన్ని ధరలూ పెరిగాయని నివేదిక అందుకున్న ధర్మాసనం

వెంటనే నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా  కారణంగా ప్రభుత్వమే ఉద్యోగులకు 50 శాతం జీతాలు ఇస్తున్న వేళ, మిగిలిన జనం ఆర్థికంగా ఎన్నో అవస్థలు పడుతున్న తరుణంలో నిత్యావసరాల ధరలను ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తీరును,  అధికారులు నమోదు చేసిన కేసుల్ని బేరీజు వేస్తే చర్యలు శూన్యమని వ్యాఖ్యానించింది. వీటిపై పత్రికల్లో వచ్చిన కథనాలను పిల్‌గా పరిగణించిన హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి జీవీ సుబ్రహ్మణ్యం నివేదిక అందజేశారు. దాన్ని చూస్తే ప్రభుత్వం చెప్పేదానికి, వాస్తవానికి పొంతన లేదని సీజే జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం అభిప్రాయపడింది.

వేర్వేరు ప్రాంతాల్లోని షాపులకు జీవీ స్వయంగా వెళ్లి పరిశీలించి ఇచ్చిన నివేదికలో పప్పులు, పొద్దుతిరుగుడు నూనె, చిరుధాన్యాలు, గోధుమ పిండి, మటన్, చేపలు, చికెన్, కూరగాయల ధరలు పెరిగాయని హైకోర్టు ఎత్తిచూపింది. కోడిగుడ్లు, టమాటాల ధరలే తక్కువగా ఉన్నాయని, కూరగాయలు సగటున రూ.40లు ఉంటే, రూ.50లకు అమ్ముతుంటే  కేసులు 270 మాత్రమే నమోదు చేయడమేమిటని ప్రశ్నించింది. నారాయణగూడ లాంటి రద్దీ ఏరియాలో గత నెల మూడే కేసులు ఉన్నాయంటే అక్రమ వ్యాపారులపై కొరడా ఝుళిపించలేనట్లేనని వ్యాఖ్యానించింది.

నేరుగా ప్రభుత్వమే ధరలపై సమీక్షిస్తోందని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ చెప్పిన జవాబుతో ధర్మాసనం  ఏకీభవించలేదు. ధరల్ని నియంత్రించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే ధరలు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు అదనపు డీజీ రాజీవ్‌ రతన్‌ హైకోర్టుకు నివేదించారు.ఏప్రిల్‌లో 270 కేసులు నమోదు చేస్తే  హైదరాబాద్‌లో 114, సైబరాబాద్‌ 54, రాచకొండ 83, నల్లగొండ 13, వరంగల్‌ 5, నిజామాబాద్‌ 1  నమోదు చేశామన్నారు.

జోన్స్‌లో పండ్లను విక్రయించే వీలుందా? 
కరోనా కేసులున్న రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లల్లో పండ్లను విక్రయించేందుకు ఉన్న అవకాశాల్ని వివరించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.మామిడి పంటకాలమని,సకాలంలో అమ్మకాలకు అనుమతి ఇవ్వకపోతే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతికి ఆస్కారం ఉందని గుర్తు చేసింది. మార్కెటింగ్‌ సౌకర్యం లేకుంటే పండ్ల రైతులు  నష్టపోతారని రిటైర్డు పశువైద్యుడు కె.నారాయణరెడ్డి పిల్‌ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతికి ఉత్తర్వులు ఇవ్వాలని న్యాయవాది చిన్నోళ్ల నరేష్‌రెడ్డి కోరారు. విచారణ 13కి వాయిదా పడింది.

మరిన్ని వార్తలు