ఏవిధంగా సమర్థించుకుంటారు..? 

5 May, 2020 01:29 IST|Sakshi
ఎన్‌.శంకర్

ఎన్‌.శంకర్‌కు భూమి కేటాయింపుపై వివరణ కోరిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు ఎకరం రూ.5 కోట్ల విలువైన భూమిని రూ.5 లక్షల చొప్పున ఐదెకరాలను కేటాయించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ కోరింది. సినీ స్టూడియో కోసం ఔటర్‌ రింగ్‌రోడ్‌కు సమీపంలోని నివాస ప్రాంతంలో ఖరీదైన భూమిని ఏవిధంగా కేటాయించారో, ఈ చర్యను ఎలా సమర్థించుకుంటారో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కరీంనగర్‌ జిల్లా ధర్మపురికి చెందిన జె.శంకర్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం మరోసారి విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ, ఇదే తరహాలో ప్రభుత్వం పలువురికి కోట్లాది రూపాయల విలువైన భూముల్ని తక్కువ ధరలకే కేటాయించడాన్ని సవాల్‌ చేసిన వ్యాజ్యాలు హైకోర్టు విచారణలో ఉన్నాయని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఆ కేసులన్నింటనీ కలిపి విచారిస్తామని, ఈ కేసుల్లో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదిగా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.   

>
మరిన్ని వార్తలు