పరీక్షలు చేయాల్సిందే.. 

27 May, 2020 02:51 IST|Sakshi

ఎలా చనిపోయినా కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్రభుత్వ లెక్కలు, వైద్య పరీక్షల తీరుపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: ‘కరోనా అగ్రరాజ్యాలనే అల్లాడిస్తోంది. అమెరికాలో లక్ష మంది వరకు చనిపోయారు. మందులేని ఆ మహమ్మారిని మట్టుబెట్టేందుకు ఇప్పటివరకు మనదేశం తీసుకున్న చర్యలు బాగున్నాయని సంతృప్తి చెందితే పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదముంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా టెస్ట్‌ల గణాంకాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. మృతదేహాల నుంచి రక్త నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ సంచాలకుడు ఉత్తర్వులు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఏవిధమైన అనారోగ్యంతో మరణించినా కరోనా పరీక్షలు నిర్వహించాలి. ప్రజా సంక్షేమం అంటే ప్రజారోగ్యమేనని గుర్తించాలి...’అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటిస్తూనే పలు సూచనలు చేసింది. కరోనా పరీక్షలు, వలస కార్మికులు, ఇతర అనుబంధ అంశాలపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. 

ఆ ఉత్తర్వులు ఎలా ఇచ్చారో అర్థం కావట్లేదు..
ఏపీ, మహారాష్ట్ర, కేరళ తదితర రాష్ట్రాల్లో మిలియన్‌కు 2 వేల పరీక్షలు నిర్వహిస్తుంటే మన రాష్ట్రంలో 518 మాత్రమే చేయడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. గుండెజబ్బు లేదా ఇతర దీర్ఘకాల రోగాలతో బాధపడే వారు మరణించినా కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌ అని నిర్ధారణ అయితే ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వారు, కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొంది. మృతదేహాల నుంచి శాంపిల్స్‌ సేకరించరాదని గత ఏప్రిల్‌ 10, 28 తేదీల్లో ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఏవిధంగా ఆ ఉత్తర్వులు జారీ చేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది. ఒక పక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ జారీ చేసిన మార్గదర్శకాలు ఇచ్చినా ఎందుకు ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారని ప్రశ్నించింది. కరోనా ఉన్న వ్యక్తి చనిపోతే అతని అంత్యక్రియల్లో పాల్గొన్న వారికీ కరోనా సోకే ప్రమాదం ఉంటుందని వైద్య శాఖ ఎందుకు గుర్తించలేదని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

పరీక్షలు ఎంతమందికి నిర్వహించారు..?
వలస కార్మికులకు పరీక్షలు నిర్వహిస్తే 118 మందికి వ్యాధి లక్షణాలున్నట్లుగా వైద్య, ఆరోగ్య శాఖ నివేదికలో పేర్కొందని, పరీక్షలు ఎంతమందికి నిర్వహించారో అందులో పేర్కొనలేదని హైకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. ఆరు రాష్ట్రాల సరిహద్దున్న రాష్ట్రానికి రైలు, బస్సు, నడిచి వచ్చే వలస కార్మికులకు ఎంతమందికి పరీక్షలు నిర్వహించారో తెలియజేయాలని ఆదేశించింది. నిర్మల్‌లో 600 మంది వలస కార్మికులు క్వారంటైన్‌లో ఉన్నారని మాత్రమే నివేదికలో ఉందని, ఎన్ని పరీక్షలు చేస్తే అంతమందిని క్వారంటైన్‌లో ఉంచింది వివరించలేదని తప్పుపట్టింది. అదేవిధంగా సూర్యాపేటలో ఈ నెల 22 నుంచి 35 నమూనాలు సేకరించినట్లుగా నివేదికలో ఉందని, వలస కార్మికులు రావడం మొదలైన తర్వాత అతి తక్కువగా నమూనాలు సేకరించారని పేర్కొంది. ఎంతమంది వలస కార్మికులు వచ్చారో, ఎంతమందికి పరీక్షలు చేశారో, వారిలో ఎంతమందికి పాజిటివ్‌ వచ్చిందో వంటి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను జూన్‌ 1వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు