గాలికొదిలేశారు! 

15 Jul, 2020 02:16 IST|Sakshi

ప్రజలు చనిపోతున్నా పట్టదా.. ప్రభుత్వానికి ఎందుకింత అహంకారం? 

తెలంగాణ సర్కారుపై మండిపడ్డ హైకోర్టు 

కరోనా పరీక్షలు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే

బ్రిటిష్‌ పాలనకంటే అధ్వాన పరిస్థితి.. గాంధీలో పరీక్షలు చేయాల్సిందే 

కరోనా ఆస్పత్రుల వివరాలు ప్రజలకు చెప్పాలి

ఖాళీ పడకలు, వెంటిలేటర్ల వివరాలూ తెలియజేయాలి 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ 27కి వాయిదా 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఏయే ఆస్పత్రులను కోవిడ్‌ సేవల కోసం ఉపయోగిస్తున్నారు.. ఏయే ఆస్పత్రుల్లో ఎన్ని బెడ్లు ఖాళీగా ఉన్నాయి.. ఎన్ని వెంటలేటర్లు ఉన్నాయి.. ఏ ఆస్పత్రుల్లో ఏ రకమైన సేవలందిస్తున్నారు.. ఆ ఆస్పత్రుల వివరాలను చిరునామాలతో సహా ప్రతికా ముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియచేయాలని హైకోర్టు మంగళ వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వల్ల తీవ్రంగా ప్రభావితులైన వ్యక్తులకు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో.. మధ్యరక, సాధారణ లక్షణాలున్న వారికి నీలోఫర్, ఫీవర్, ఛాతి ఆస్పత్రుల్లో.. నేచర్‌క్యూర్, ఆయుర్వేద ఆస్పత్రులను ఐసోలేషన్‌ కోసం కేటాయించినట్లు ప్రతికల ద్వారా ప్రజలకు చెప్పాలని సూచించింది.(10 వేల జనాభాకు 8 మందే డాక్టర్లు)

అలాగే కోవిడ్‌ సేవల కోసం గుర్తించిన 87 ఆస్పత్రుల వివరాలను కూడా తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ ఆదేశాల అమలుపై పూర్తి వివరాలతో నివేదికను తమ ముందుంచాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.  

ప్రజలకు ఎందుకు చెప్పడంలేదు? 
కార్పొరేట్‌ ఆస్పత్రులు, టీచింగ్‌ ఆస్పత్రుల్లో భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నారని, బోధనాస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించాలని, ఆసుపత్రుల్లో ఉన్న బెడ్స్‌ ఖాళీలను డ్యాష్‌బోర్డుల ద్వారా తెలియజేయాలని కోరుతూ డీజీ నరసింహారావు, శ్రీకిషన్‌శర్మ, కర్ణాటి శివ గణేశన్, డాక్టర్‌ శ్రీనివాసన్‌లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య విద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. హైదరాబాద్‌ పరిధిలో 31 ప్రభుత్వ, ప్రైవేటు బోధన ఆస్పత్రులను కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించామని వారు నివేదించారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 87 ఆస్పత్రులను కోవిడ్‌ సేవల కోసం కేటాయించామన్నారు. 54 ఆసుపత్రుల్లో 8,834 బెడ్‌లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఈ వివరాలేవీ ప్రజలకు ఎందుకు తెలియచేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. గాంధీ ఆస్పత్రిలో అందరికీ పరీక్షలు చేయలేమని, కేవలం చికిత్స మాత్రమే అందిస్తున్నామని వారు కోర్టుకు తెలిపారు. అందుబాటులో ఉన్న కిట్‌లతో గర్భిణీలకు మాత్రమే పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. అలాగే సనత్‌నగర్‌ ఈఎస్‌ఐ ఆసుపత్రిలో 300 పడకలను కోవిడ్‌ సేవలకు కేటాయించామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిని కూడా కోవిడ్‌ సేవల కోసం ఉపయోగించుకునే విషయాన్ని పరిశీలించాలని సూచించింది. 

గాంధీలో పరీక్షలు చేయడానికి ఇబ్బందేంటి? 
‘గాంధీ ఆస్పత్రి మొదటి కోవిడ్‌ ఆసుపత్రిగా అందరికీ సుపరిచితం. దీంతో ఎక్కువ మంది బాధితులు ఇక్కడికే వస్తుంటారు. అయితే ఇక్కడ కోవిడ్‌ పరీక్ష లేదన్న కారణంతో వచ్చిన వారు వెనక్కి వెళ్లిపోరాదు. అలా వెళ్లిపోతే అది వారికి ప్రాణాంతకంగా మారొచ్చు. అందువల్ల గాంధీలో కూడా కరోనా పరీక్షలు నిర్వహించి తీరాలి. ఇప్పటికే 1500 ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టింగ్‌ కిట్‌లు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని కిట్‌లను అందుబాటులో ఉంచుతామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు చెబుతున్నారు. అలాంటప్పుడు పరీక్షలు చేయడానికి ఇబ్బంది ఏముంటుంది? కరోనా వస్తే ఏ ఆస్పత్రికి వెళ్లాలి.. అవి ఎక్కడ ఉన్నాయి.. వాటిలో ఉన్న సౌకర్యాలు.. పడకల వివరాలు ఏవీ కూడా ప్రజలకు తెలియడం లేదు. ఈ వివరాలన్నింటినీ ప్రజలకు తెలియచేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం రోజూ విడుదల చేస్తున్న హెల్త్‌ బులిటెన్‌లో పడకల సంఖ్య, ఖాళీల సంఖ్య వివరాలను తెలుగు, ఇంగ్లిష్, హిందీ పత్రికల్లో ప్రచురించాలి. ఓ ఆస్పత్రికి ఫోన్‌ చేసినప్పుడు ఆ ఆసుపత్రిలో ఉన్న పడకల ఖాళీల వివరాలను మెసేజ్‌ రూపంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి’ అని హైకోర్టు.. ప్రభుత్వాన్ని ఆదేశించింది.  

కార్పొరేట్‌ ఆస్పత్రుల ఫీజుల్ని ఆదుపు చేయండి 
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనాకు వైద్యం చేసేందుకు ఇచ్చిన జీవో గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని హైకోర్టు స్పష్టంచేసింది. జీవోలో నిర్ధేశించిన రేట్ల కంటే ఎక్కువ వసూలు చేసే ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రైవేట్‌ ఆస్పత్రులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉందో లేదో అర్ధం కానట్లుగా ఉందని వాఖ్యానించింది. కిమ్స్‌లో మీర్‌ అలీఖాన్‌ రూ.4.25 లక్షలు, యశోదాలో మనోజ్‌ తివారికి రూ.4.21 లక్షలు బిల్లు వేశారని, ఆ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తామని ప్రభుత్వం నోటీసు ఇచ్చిందో లేదో చెప్పాలని శ్రీనివాసరావును ప్రశ్నించింది. కార్పొరేట్‌ ఆస్పత్రులపై ఫిర్యాదు చేసేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదని కూడా నిలదీసింది. 104కు ఫోన్‌ చేస్తే చర్యలు తీసుకుంటామని శ్రీనివాసరావు జవాబు చెప్పారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై వాదనలు విన్న ధర్మాసనం.. తాము జారీ చేసిన ఆదేశాల అమలు విషయంలో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలంటూ విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.  

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలు చనిపోతే మాకేంటి అన్నట్లుంది. ప్రభుత్వానికి ఇంత అహంకారం ఏమిటో అర్థం కావడంలేదు. బ్రిటిష్‌ పాలన కంటే పరిస్థితి అధ్వానంగా ఉంది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు చేయరు. చికిత్స మాత్రమే చేస్తామంటారు. ప్రసూతి ఆస్పత్రి పెట్టి, ఇక్కడ ప్రసవాలే చేస్తాం.. పరీక్షలు చేయమన్నట్లుగా, గిటార్‌ వాయిద్యకారుడు నేను గిటార్‌ వాయించనన్నట్లు ప్రభుత్వ తీరు ఉంది. పరీక్షలు చేయించడం ప్రభుత్వ బాధ్యత. జనాన్ని గాలికి వదిలేయకూడదు. దయలేని ప్రభుత్వ మనస్తత్వం అంతు చిక్కడంలేదు. పరీక్షలు చేయకుండా ప్రజలను వెనక్కి పంపడం ద్వారా ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. 
– రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు  

>
మరిన్ని వార్తలు