సిగరెట్టు.. మంటపెట్టు

2 Apr, 2017 05:05 IST|Sakshi
సిగరెట్టు.. మంటపెట్టు

రాష్ట్రంలో అత్యధిక అగ్నిప్రమాదాలు సిగరెట్‌ వల్లే  
ఏప్రిల్, మే నెలల్లోనే అధిక ప్రమాదాలు
నిర్లక్ష్యం వద్దంటూ అగ్నిమాపక శాఖ సూచనలు


సాక్షి, హైదరాబాద్‌: పొగరాయుళ్ల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో అగ్నిప్రమాదాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా జరిగే అగ్నిప్రమాదాల్లో 50 శాతానికిపైగా వాటా పొగరాయుళ్లదేనని అగ్నిమాపక శాఖ తెలిపింది. సిగరెట్‌ అంటించి అగ్గిపుల్లను ఆర్పకుండా పడేయటం, తాగిన సిగరెట్‌ను పూర్తిగా ఆర్పకుండా పడేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఏటా జరుగుతున్న ప్రమాదాలు, వాటికి గల కారణాలు, కారకులు తదితర అంశాలపై అగ్నిమాపక శాఖ పూర్తిస్థాయిలో నివేదిక రూపొందించింది. రాష్ట్రంలో 2010 నుంచి జరుగుతున్న అగ్నిప్రమాదాలను పరిశీలిస్తే ఏటా వెయ్యికి పైగా ప్రమాదాలు పెరుగుతున్నాయని నివేదికలో పేర్కొంది.

పెరుగుతున్న మృతుల సంఖ్య..
అగ్నిప్రమాదాలతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతూ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా ఏప్రిల్, మే మాసాల్లోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతు న్నారు. 2010 నుంచి 2016 వరకు 755 మంది అగ్నిప్రమాదాలకు ఆహుతయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం ప్రమా దాల్లో 928 మందిని సురక్షితంగా రక్షించగలి గామన్నారు. సిగరెట్‌ తాగిన తర్వాత పడేసేముందు ఒక్క క్షణం ఆలోచించాలని, నిప్పు ఆర్పివేసి పడేస్తే ప్రమాదాలు చాలావరకు తగ్గుతాయని చెప్పారు.

సిగరెట్‌ వల్లే 4,821 ప్రమాదాలు
పొగరాయుళ్ల వల్లే సగానికి అగ్నిప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలో స్పష్టంగా బయటపడింది. 2015–16లో 9,530 అగ్నిప్రమాదాలు జరగ్గా, వాటిలో 4,821 ప్రమాదాలు సిగరెట్‌ వల్లే జరిగాయని వెల్లడైంది. మిగతా ప్రమాదాలు విద్యుత్‌ పరికరాలు, పేలుడు పదార్థాల నిల్వ, ఓవెన్‌ స్టౌవ్స్, కెమికల్‌ కంపెనీలు, గోడౌన్లు, కోల్‌గ్యాస్‌ తదితర కారణాల వల్ల జరిగినట్లు తేలింది.

మరిన్ని వార్తలు