'సర్వే’త్రా సక్సెస్..

20 Aug, 2014 06:58 IST|Sakshi
'సర్వే’త్రా సక్సెస్..

 దాదాపు 95 శాతం కుటుంబాల సమాచారం సేకరణ
 సమగ్ర కుటుంబ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్న ప్రజలు
 పలుచోట్ల అర్ధరాత్రి వరకూ కొనసాగిన సర్వే
 ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25-40 ఇళ్ల కేటాయింపు
 బ్యాంకు ఖాతాల వివరాలు ఇచ్చేందుకు ప్రజల విముఖత
 పలుచోట్ల ఎన్యూమరేటర్ల డుమ్మా.. ఏర్పాట్లలో లోపాలు
 వరంగల్‌లో కలెక్టర్ నివాసం ఎదుట ధర్నా
 తెలంగాణవ్యాప్తంగా పూర్తిగా బంద్ వాతావరణం
 రాష్ట్రవ్యాప్తంగా కదలని బస్సులు

 
 సాక్షి నెట్‌వర్క్: ప్రజలు, రాజకీయవర్గాల్లో ఎంతో ఆసక్తి.. ఒకింత ఉత్కంఠ, వివాదాలను రేకెత్తించిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. అధికారుల పొరపాట్లు, గ్రామస్తుల ఆందోళనల మధ్య విజయవంతంగా పూర్తయింది. సర్వేకు సంబంధించిన ఇబ్బందులను పరిష్కరించడానికి వీలుగా సెర్ప్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఎన్యూమరేటర్ల రాక కోసం ప్రజలు వేచిచూడడం, వారు తమ ఇళ్ల వద్దకు రాగానే అవసరమైన పత్రాలు చూపి, నమోదు చేసుకోవడం కనిపించింది. చాలాచోట్ల అనుకున్న సమయానికి సర్వే ప్రారంభం కాలేదు. ఎన్యూమరేటర్ల కోసం ఎదురుచూసిన గ్రామస్తులు.. ఎంతకూ రాకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ధర్నాలకు దిగారు. ఎన్యూమరేటర్లను, అధికారులను నిర్బంధించారు. మరికొన్ని చోట్ల సర్వేను బహిష్కరించారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో రాత్రి తొమ్మిది గంటల వరకు ఎన్యూమరేటర్లు రాలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు.. సర్వే కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా సెలవు ప్రకటించడంతో.. అంతటా కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపించింది. సర్వే వల్ల ఉదయం, సాయంత్రం మినహా రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సర్వే కోసం వారం రోజులుగా ప్రత్యేక బస్సులు నడిపి రూ. 12 కోట్ల ఆదాయం ఆర్జించిన ఆర్టీసీకి, మంగళవారం దెబ్బకు రూ. 5 కోట్ల నష్టం వాటిల్లింది.
 
 ఉదయం నుంచే..: సర్వే కోసం ఎన్యూమరేటర్లను ఉదయం ఐదు గంటల నుంచే మండల కేంద్రాల నుంచి గ్రామాలకు పంపారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 25 నుంచి 40 కుటుంబాల వరకూ కేటాయించారు. దాంతో వారు సర్వే పత్రంలోని అన్ని వివరాలను సేకరించకుండా ప్రధానంగా కుటుంబసభ్యుల పేర్లు, ఆధార్ నంబరు, వాహనాలు, ఆస్తులు, ఇళ్లు, సామాజిక అంశాలపై మాత్రమే సమాచారాన్ని నమోదు చేశారు. బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాల వివరాలు ఇవ్వడానికి చాలావరకు ప్రజలు విముఖత వ్యక్తం చేశారు. రాత్రి 9.30 సమయానికి రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం సర్వే పూర్తయినట్లు అధికారులకు సమాచారం అందింది. జిల్లా, మండలకేంద్రాలు, గ్రామాల్లో సర్వేకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన కనిపించింది.
 
 పల్లెల్లో సర్వే సందడి
 
 సర్వే నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా పల్లెల్లో సందడి నెలకొంది. పండుగ వాతావరణాన్ని తలపించింది. పట్టణ ప్రాంతాల్లోనేమో పూర్తిగా బంద్ వాతావరణం కన్పించింది. నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడే నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట, కరీంనగర్ జిల్లా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఆదిలాబాద్ జిల్లా బాసర తదితర పుణ్య క్షేత్రాలన్నీ బోసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 15 భూగర్భ గనులు, నాలుగు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మైదాన ప్రాంతాల్లో కంటే గోండు, కొలాం, మన్నేవార్ తదితర తెగల వారు నివసించే ఏజెన్సీ ప్రాంతాల్లో సర్వేకు బాగా స్పందన వచ్చిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఒకే ఇంట్లో నాలుగైదు కుటుంబాలున్నప్పటికీ... కేవలం ఒక కుటుంబం వివరాలు మాత్రమే సేకరిస్తున్నారంటూ ఇబ్రహీంపట్నం, తాండూరు, హయత్‌నగర్, రాజేంద్రనగర్‌లో స్థానికులు ఆందోళన చేశారు. మెదక్ జిల్లాలో సర్వేకు భారీ స్పందన కనిపించింది. మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని తన నివాసంలో సర్వేలో పాల్గొన్నారు. కేసీఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సర్వేకు హాజరు కాలేదు.
 
 పాలమూరులో పెరిగిన కుటుంబాలు..
 
 మహబూబ్‌నగర్‌లో ముందుగా లెక్కించిన దానికంటే పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఉండడంతో సర్వేలో జాప్యం చోటుచేసుకుంది. రాత్రి పదిగంటల అనంతరం కూడా చాలా చోట్ల ఎన్యుమరేటర్లు సర్వే కొనసాగిస్తూనే ఉన్నారు. మల్దకల్ మండలం నాగర్‌దొడ్డి గ్రామంలో వివరాల సేకరణకు వచ్చిన ఎన్యుమరేటర్ భూమి వివరాలు అడగడంతో ఇద్దరు అన్నదమ్ములు గొడవకు దిగారు. వివాదం ముదిరి కొట్టుకున్నారు. సర్వేకు ఖమ్మం జిల్లాలో మంచి స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని ముస్తఫానగర్‌లో జాతకాలు చెప్పే కుటుంబాలు సర్వే కోసం సింగపూర్ నుంచి వచ్చారని సమాచారం. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్వగ్రామం ముంపు మండలంలో ఉండడంతో ఆయన భద్రాచలంలో ఉంటున్న ఇంటికి కూడా అధికారులు స్టిక్కర్ వేయలేదు. దీంతో ఆయన ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడి తన వివరాలు నమోదు చేసుకున్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో ఒక ఎన్యూమరేటర్ మద్యం తాగి వచ్చి హంగామా సృష్టించారు.
 
 వరంగల్‌లో అస్తవ్యస్తం
 
 సర్వేకు వరంగల్ జిల్లా యంత్రాంగం సరైన ఏర్పాట్లు చేయలేకపోయింది. ముందుగా సరైన సంఖ్యలో ఎన్యూమరేటర్లను నియమించకుండా... చివరి నిమిషంలో ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్థులకు ఆ విధులను అప్పగించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. వరంగల్ నగరంలోని గిర్మాజీపేట, బొడ్రారుు వంటి కొన్ని ప్రాంతాలకు ఎన్యూమరేటర్లు వెళ్లలేదు. ఇళ్ల వివరాల విషయంలో అధికారులు చేసిన తప్పిదాలతో సర్వే అస్తవ్యస్తంగా మారింది. హన్మకొండ జవహర్‌కాలనీ, జూలైవాడ, రెవెన్యూకాలనీ, ప్రకాష్‌రెడ్డిపేట తదితర కాలనీల నుంచి ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి అధికారులను కలిసినా స్పందన కనిపించకపోవడంతో... కలెక్టర్ నివాసం ముందు ధర్నా చేశారు. వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కొందరు పట్టణవాసులు బైఠాయించి నిరసన తెలిపారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ఎస్సీ కాలనీలో డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నారు.
 
 సర్వే అస్తవ్యస్తం: ఇంద్రసేనారెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్:  సమగ్రకుటుంబ సర్వే పూర్తిఅస్తవ్యస్తంగా సాగిందని, చెత్తబుట్టలో పడేయడానికి తప్ప ఆ వివరాలు ఎందుకూ పనికిరావని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి మంగళవారం విమర్శించారు. కర్ఫ్యూ వాతావరణం సృష్టించిన ఈ సర్వే దండగేనన్నారు. ప్రభుత్వానికి ఏదైనా రహస్య ఎజెండా ఉండి ఉంటే దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

 జిల్లాల వారీగా నమోదైన శాతాలు..
 
 జిల్లా                       శాతం
 మహబూబ్‌నగర్         99
 ఖమ్మం                    98
 కరీంనగర్                 98
 నల్లగొండ                 97
 మెదక్                    96
 ఆదిలాబాద్              96
 నిజామాబాద్            93
 రంగారెడ్డి                 89
 వరంగల్                  86
 జీహెచ్‌ఎంసీ              77
 

>
మరిన్ని వార్తలు