తెలంగాణ ఐసెట్-2015 షెడ్యూల్ విడుదల

26 Feb, 2015 02:58 IST|Sakshi

' 28న నోటిఫికేషన్ విడుదల
' మార్చి 5 నుంచి ఆన్‌లైన్‌లో అఫ్లికేషన్లు
' మే 22న ఐసెట్ పరీక్ష
' ఉన్నత విద్యా మండలి   చైర్మన్ పాపిరెడ్డి  

 
 కరీంనగర్: కాకతీయ యూనివర్సిటీ నిర్వహిం చే ఐసెట్-2015 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ పాపిరెడ్డి బుధవారం కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ సమావేశ మందిరంలో విడుదల చేశారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ, కాకతీయ వర్సిటీ ఇన్‌చార్జి వీసీ కడారు వీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పరీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. పరీక్ష నిర్వహణకు గతంలో 13 కేంద్రాలుండగా, ఈసారి ఆ సంఖ్యను 15కు పెంచామని, కొత్తగా నల్లగొండ జిల్లా కోదాడ, కరీంనగర్ జిల్లా జగిత్యాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
 
 ఐసెట్ నోటిఫికేషన్ ఈనెల 28న విడుదల చేస్తామని, పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, మార్చి 5 నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు రూ. 250 రుసుముతో సమర్పించవచ్చునని పేర్కొన్నారు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 14 వరకు, రూ. 2 వేల అపరాధ రుసుమతో ఏప్రిల్ 25 వరకు, రూ. 5 వేల అపరాధ రుసుముతో మే 5వరకు, రూ.10 వేల అపరాధ రుసుముతో మే 18వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని వివరించారు. ఏప్రిల్ 30 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. మే 22న పరీక్ష నిర్వహించి, మే 25న ప్రైమరీ కీ, జూన్ 9న ఫైనల్ కీ విడుదల చేస్తామని తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ విద్యార్థులకు ఏ ప్రవేశ పరీక్షలైనా ఒకే సమయంలో ఉండకుండా టైం టేబుల్  నిర్ధారించామన్నారు.

మరిన్ని వార్తలు