దేశానికే ఆదర్శం

27 Jan, 2017 02:37 IST|Sakshi
దేశానికే ఆదర్శం
రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది
గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌
- కోటి ఎకరాల సాగు లక్ష్యంగా ప్రభుత్వం కృషి
- సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.25 వేల కోట్ల కేటాయింపు
- మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ అద్భుత ప్రాజెక్టులు
- విద్యుత్‌ రంగంలో మంచి పురోగతి సాధించాం
- రికార్డు స్థాయిలో హరితహారం చేపట్టాం
- పాలనను ప్రజల చెంతకు చేర్చేలా కొత్త జిల్లాల ఏర్పాటు
- బంగారు తెలంగాణ దిశగా ముందుకెళుతున్నాం
- కలసికట్టుగా పనిచేస్తేనే సుఖశాంతులు లభిస్తాయని వ్యాఖ్య
- సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఘనంగా వేడుకలు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని, తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళుతోందని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ పేర్కొన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రజలు ఆనందంగా ఉండేందుకు, మెరుగైన జీవనాన్ని గడిపేందుకు తగిన పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు.
 
అతి తక్కువ వయసున్న తెలంగాణ.. బంగారు తెలంగాణగా రూపుదిద్దుకునే లక్ష్యంతో వడివడిగా ముందుకు వెళుతోందని.. ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని వ్యాఖ్యానించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో గవర్నర్‌ నరసింహన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనిక, పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించి.. ప్రసంగించారు. ప్రజాస్వామ్యంలో నేను, నీవు అనే పదాలకు తావులేదని... మనమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన అభివృద్ధి, సుఖ శాంతులు లభిస్తాయయని పేర్కొన్నారు. 
 
గవర్నర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...
కోటి ఎకరాలను సాగులోకి తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, భక్త రామదాసు వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందుకోసం ఈ ఏడాది ప్రత్యేకంగా రూ.25 వేల కోట్లు కేటాయించింది. కాళేశ్వరాన్ని వేగంగా పూర్తి చేయడం కోసం మహారాష్ట్రతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.42 వేల కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ ద్వారా 2018 నాటికి 25 వేల గ్రామాల్లో ఇంటింటికీ తాగునీరు ఇవ్వాలనేది లక్ష్యం. ఈ ప్రాజెక్టు పూర్తయితే మరో మూడు దశాబ్దాల వరకు తాగునీటికి ఇబ్బందులు ఉండవు. రైతాంగానికి మేలు చేకూర్చే వినూత్న కార్యక్రమం మిషన్‌ కాకతీయ. సుమారు 45,600 చెరువులకు పునరుద్ధరించడమే దీని లక్ష్యం. నీతి ఆయోగ్‌ కూడా దీనిని ప్రశంసించింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణలు మంచి పురోగతిని కనబర్చాయి. నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ అందించేందుకు వీలు కలిగింది. మిగులు విద్యుత్‌ సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సోలార్, థర్మల్‌ ప్రాజెక్టులను చేపట్టింది.
 
రాష్ట్రంలో అడవుల శాతాన్ని 25 నుంచి 33శాతానికి పెంచేందుకు హరితహారం కార్యక్రమం చేపట్టాం. గతేడాది జూలై 11న ఒకేరోజు 29 లక్షల మొక్కలు నాటడం రికార్డుగా నిలిచింది. పేద వర్గాల వారికి సమాజంలో సమున్నత గౌరవం కల్పించేందుకు ప్రభుత్వం 36 లక్షల మంది లబ్ధిదారులకు ఆసరా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసం ఏటా రూ.4,900 కోట్లు ఖర్చు చేస్తోంది. ఎటువంటి ఆదరవులేని ఒంటరి మహిళలను ఆదుకునేందుకు నెలకు రూ.1,000 చొప్పున పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించింది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. గత డిసెంబర్‌లో ఎర్రవల్లి, నరసన్నపేట గ్రామాల్లో నిర్మించిన డబుల్‌ ఇళ్లలో సామూహికంగా గృహప్రవేశం కూడా జరిగింది. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల పెళ్లికోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టింది. ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. వ్యాపార కార్యకలాపాలు సులభంగా నిర్వహించే వీలున్న రాష్ట్రంగా.. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ప్రపంచబ్యాంకు నుంచి గుర్తింపు పొందింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్‌లో దేశంలోనే నంబర్‌వన్‌ స్థానం దక్కింది. టీఎస్‌–ఐపాస్‌ విధానంతో రాష్ట్రానికి సుమారు 3 వేల పరిశ్రమలు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 2లక్షల మందికి ఉపాధి లభించింది. పాలనను ప్రజలకు చేరువ చేస్తామన్న హామీ మేరకు 21 కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
నగదు రహిత లావాదేవీల్లో ఇతర రాష్ట్రాలకు తెలంగాణ స్ఫూర్తిగా నిలిచింది. సిద్ధిపేట నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకుంది. ఇబ్రహీంపూర్‌ గ్రామం వంద శాతం నగదు రహిత లావాదేవీలను సాధించింది. హైదరాబాద్‌ వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మెట్రోరైలు ఈ ఏడాది పరుగులు పెట్టే అవకాశముంది. రాష్ట్రంలో పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. యాదాద్రి, వేములవాడ, జోగులాంబ, భద్రాద్రి, ధర్మపురి, బాసర ఆలయాలను మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతోంది. ఐటీలో పురోభివృద్ధికి ప్రభుత్వం ఐసీటీ విధానాలను అమలు చేస్తోంది. ఐటీ రంగంలో జాతీయ సగటుకన్నా 3 శాతం అధిక వృద్ధితో తెలంగాణ 16 శాతం వృద్ధి సాధించింది.  రాష్ట్రంలో అనేక పథకాలు ప్రజాసంక్షేమం దిశగా అమలు చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలి.
 
అమర జవాన్లకు కేసీఆర్‌ నివాళులు
గణతంత్ర వేడుకల సందర్భంగా పరేడ్‌గ్రౌండ్స్‌లోని అమర జవాన్ల స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్‌ పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించారు. సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. గణతంత్ర వేడుకల్లో మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్‌ మధుసూదనాచారి, తమిళనాడు మాజీ గవర్నర్‌ కె.రోశయ్య, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, జోగురామన్న, చందూలాల్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పద్మారావు, సీఎస్‌ ఎస్పీసింగ్, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా తమ మీడియా కవరేజీ కోసం ప్రదేశం ఎంపికలో కార్యక్రమ నిర్వాహకులు నిర్లక్ష్యం చూపారంటూ.. మీడియా ప్రతినిధులు గవర్నర్‌ ప్రసంగం సమయంలో నిలబడే ఉండి నిరసన వ్యక్తం చేశారు.
 
ఆకట్టుకున్న కవాతు
గణతంత్ర వేడుకల్లో నిర్వహించిన సైనిక, పోలీసు బృందాల కవాతు ఆకట్టుకుంది. రాష్ట్ర పోలీసులతో పాటు ఒడిశా, జమ్మూ కశ్మీర్‌ నుంచి వచ్చిన పోలీసు బృందాలు, కొన్ని సైనిక వాయిద్య బృందాలు ఇందులో పాల్గొన్నాయి. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బృందాలకు గవర్నర్‌ నరసింహన్‌ ట్రోఫీలను, జ్ఞాపికలను అందజేశారు. సీనియర్‌ విభాగంలో సిక్త్‌ జమ్మూ కశ్మీర్‌ (47వ బ్రిగేడ్‌) సైనిక బృందం ప్రథమ స్థానంలో నిలవగా, 18వ డోగ్రా రెజిమెంట్‌ (76 బ్రిగేడ్‌) బృందం రెండో స్థానంలో నిలిచింది. జూనియర్‌ విభాగంలో తెలంగాణ సోషల్‌ వెల్‌ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూషన్స్‌ సొసైటీ విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలవగా.. ఎన్‌సీసీ బాలికల బృందం రెండో స్థానంలో నిలిచింది. వేడుకలలో పాల్గొన్న ఒడిశా రాష్ట్ర పోలీసు బృందానికి ప్రత్యేక అభినందన ట్రోఫీని అందజేశారు. కవాతులో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ విద్యార్థుల బృందం, తెలంగాణ రాష్ట్ర మౌంటెయిన్‌ పోలీస్, ఎన్‌సీసీ బాలుర బృందం, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం, తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌ 4వ బెటాలియన్, భారత వైమానిక దళం పాల్గొన్నాయి.
>
మరిన్ని వార్తలు