ఏడున్నడో.. ఎట్లున్నడో..

11 Nov, 2017 10:27 IST|Sakshi

బతుకుదెరువు కోసం గల్ఫ్‌ బాట

అదృశ్యమైన కొండాపూర్‌ వాసి నర్సింహులు  

యేడాదిన్నరగా జాడ లేదు..  

 తల్లడిల్లుతున్న భార్య, పిల్లలు 

కామారెడ్డి క్రైం: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్‌ గ్రామానికి చెందిన శాడ నర్సింహులుకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నా నీటి సౌకర్యం లేక, పంటలు పండక అప్పులు అయ్యాయి. దీంతో గల్ఫ్‌ పోవాలనుకున్నాడు. సౌదీలోని గిద్ద ప్రాంతం లో కంపెనీ వీసాతో ఉద్యోగం ఉందని తెలుసు కుని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కామారె డ్డిలోని ఓ ట్రావెల్స్‌ ఏజన్సీలో రూ.80వేలు చెల్లించి 2016 జూన్‌ 29న ఇక్కడ నుంచి సౌదీ బయల్దేరాడు. మరుసటి రోజు అతని భార్య కిష్టవ్వకు ఫోన్‌ చేసి కంపెనీ మనుషులు వచ్చి తనను తీసుకు వెళ్లారని చెప్పాడు. ఆ తర్వాత అతని వద్ద నుంచి ఇక ఎలాంటి ఫోన్‌ రాలేదు. కుటుంబ సభ్యులు అతనితోపాటు గదిలో ఉండే రామారెడ్డి గ్రామానికి చెందిన వారికి ఫోన్‌ చేసి వాకబు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రోజు నుంచి నర్సింహులు కనిపించ డం లేదని వారు చెప్పడంతో ఆందోళనకు     గుర య్యారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండాపో యింది. కామారెడ్డిలోని ట్రావెల్‌ ఏజన్సీ, వీసా పంపిన వ్యక్తి అందరూ చేతులెత్తేశా రు. దీంతో నర్సింహులు కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. 

పట్టించుకుంటలేరు..
సౌదీ వెళ్లగానే ఫోన్‌ చేసిండు. చేరుకున్న అన్నడు. ఆ తర్వాత ఎక్కడున్నడో, ఎట్లున్నడో ఏం తెల్వదు. వీసా పంపిన వాళ్లను, అందరిని అడిగి జూసినం. మాకేం తెల్వదంటున్నారు. మా ఆర్థిక పరిస్థితి బాగా లేదు. అప్పులు పెరిగినై. పిల్లలు బెంగపెట్టుకున్నరు. ప్రభుత్వం స్పందించి నా భర్త జాడను తెలుసుకుని మాకు న్యాయం చేయాలి. 
– కిష్టవ్వ 

కష్టాల్లో నర్సింహులు కుటుంబం
గల్ఫ్‌ వెళ్లిన నర్సింహులు గల్లంతవడంతో అతని కుటుంబం కష్టాల్లో పడింది. అతనిది నిరుపేద కుటుంబం. ఆయన భార్య కిష్టవ్వ బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను చదివిస్తోంది. కూతురు శిరీష కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ఫైనలి యర్‌ చదువుతుండగా, స్థోమత లేక కుమారుడు నవీన్‌ ఇంటర్‌తో ఆపేశాడు. డిగ్రీ చదువుతూనే తల్లికి చేదోడుగా ఉండేందుకు శిరీష కూడా బీడీలు చుడుతోంది. ఓ వైపు నర్సింహులు జాడ లేదనే బాధతోపాటు గల్ఫ్‌ వెళ్లేందుకు చేసిన అప్పులు తడిసి మోపెడవుతున్నాయని ఆందోళనకు గురవుతున్నారు. 

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లిన వ్యక్తి అక్కడి వెళ్లిన మరుసటి రోజే అదృశ్యమయ్యాడు. సౌదీకి వెళ్లిన అతడు.. అక్కడి చేరుకున్నట్టు ఫోన్‌ చేసి చెప్పాడు. అదే చివరి మాట. అప్పటి నుంచి ఫోన్‌ లేదు.. అత ని జాడ లేదు. ఎన్నిర కాలుగా ప్రయత్నించినా యేడాదిన్నరగా ఏ సమాచారమూ లేదు. ఇంటికి పెద్ద దిక్కు ఏమయ్యాడో, ఎక్కడున్నడో.. ఎట్లున్నడో తెలియక భార్య, పిల్లలు తల్లడిల్లుతున్నారు. 

సిరిసిల్ల: గల్ఫ్‌ వెళ్లే వారిలో పెద్దగా చదువు రానివారు ఎక్కువగా ఉన్నారు. వీరికి నకిలీ ఏజెంట్లు విజిటింగ్‌ వీసాలు అంటగట్టి వర్క్‌పర్మిట్‌ లేకుండా పంపిస్తున్నారు. దీంతో అక్కడికి వెళ్లాక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇమ్మిగ్రెంట్స్‌ (పీవోఈ)ని ఏర్పాటు చేసింది. తెలంగాణ జిల్లాల్లో లైసెన్స్‌ పొందిన ఏజంట్ల వివరాలు హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ప్రొటెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎమ్మిగ్రెంట్స్‌(పీవోఈ) కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. 

ఏదైనా ఒక పనిలో వృత్తి నైపుణ్యం కలిగి ఉండాలి. నైపుణ్యం ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఏ నైపుణ్యం లేకుండా వెళ్తే.. అన్‌ స్కిల్‌ లేబర్‌గా గొడ్డు చాకిరీ చేయాల్సి ఉంటుంది.  

పాస్‌పోర్టులో ఇంటిపేరు, తండ్రి, తల్లి, భార్య పేర్లు తప్పులు లేకుండా చూసుకోవాలి. ఇంటి అడ్రస్, విద్యార్హతలు, జన్మస్థలం, పుట్టిన తేదీ నమోదు చేసుకోవాలి. 

ఇండియన్‌ ఎంబసీచే ధ్రువీకరించబడిన అరబ్బీతో పాటు ఇంగ్లీష్, తెలుగు భాషలలో గల ఉద్యోగ ఒప్పం ద పత్రం కలిగి ఉండాలి. ఉద్యోగ ఒప్పంద పత్రం ఒక శ్రామికునిగా మీ హక్కులను కాపాడుతుంది. 

కనీసం ఆరు నెలలపాటు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టు ఉండేట్లుగా చూసుకోవాలి. చెల్లుబాటులో ఉన్న వీసా తప్పకుండా పాస్‌పోర్టుపై స్టాంపింగ్‌ అయి ఉండాలి. లేదా విడిగా వీసాపత్రం ఉండాలి. 

విదేశాలకు వెళ్లే ముందు వైద్యపరీక్షలు చేయించుకోవాలి. గల్ఫ్‌లో పనిలోకి తీసుకునే ముందు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఫెయిల్‌ అయితే ఉద్యోగం నుంచి తొలగించి ఇంటికి పంపిస్తారు. ముందుగా చూసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో జాయింట్‌ బ్యాంకు అకౌంట్‌ తీయాలి. 

గల్ఫ్‌ వెళ్లేవారు పాస్‌పోర్టు, వీసా, ఆధార్‌కార్డు వంటి ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్‌ తీసి ఒక సెట్‌ ఇంటి దగ్గర భద్రపరచాలి. 

విదేశాలకు వెళ్లేవారు ప్రవాసీ భారతీయ బీమా యోజన (పీబీబీవై ఇన్సూరెన్స్‌) తప్పనిసరిగా చేయించుకోవాలి. 

మరిన్ని వార్తలు