లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలను మినహాయించండి

9 Apr, 2020 02:39 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి టిఫ్‌ వినతి

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ఐఐసీ పారిశ్రామిక వాడల్లోని ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్‌) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రయోగాత్మకంగా నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టిఫ్‌ అధ్యక్షులు కె.సుధీర్‌రెడ్డి బుధవారం సీఎంకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఐదు వేల రకాల ఉత్పత్తుల ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.

టీఎస్‌ఐఐసీ పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఒకే ఆవరణలో ఉండటంతో వేతనాల చెల్లింపు, సరఫరాదారులు, కొనుగోలుదారులతో సమన్వయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఐటీ రంగం తరహాలో ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు లేకపోవడంతో కార్మికులకు జీవనోపాధి కరువైందన్నారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఎత్తివేతపై సంప్రదింపులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని టిఫ్‌ వినతిపత్రంలో సీఎంను కోరింది. 

వినతిపత్రంలోని ముఖ్యాంశాలు 
► రోజుకు ఒక షిఫ్ట్‌ చొప్పున పనిచేసేందుకు అవసరమైన సిబ్బందికి అనుమతివ్వాలి. పరిశ్ర మలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కార్మికులకు అనుమతి ఇవ్వాలి. ఈ మేరకు పోలీసు, జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్దేశిత కాల వ్యవధితో పాస్‌లు జారీ చేయాలి. రవాణా సౌకర్యాలు, ముడిసరుకులు, ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కంపెనీలు ఎప్పటికప్పుడు సమర్పిస్తాయి.  
► ఫ్యాక్టరీ పరిసరాలను శానిటైజ్‌ చేయడం, కార్మికుల రోజూ వారీ ఆరోగ్యంపై పర్యవేక్షణ, పనిప్రదేశంలోనూ సామాజిక దూరం పాటించే లా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటాయని ప్రభుత్వానికి హామీ ఇస్తాయి.  

మరిన్ని వార్తలు