టిమ్స్‌ రెడీ..!

28 Jun, 2020 04:18 IST|Sakshi

రేపట్నుంచి సేవలు ప్రారంభిస్తాం

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల

నిబంధనలు పాటించని ప్రైవేట్‌ ల్యాబ్‌లకు నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. సోమవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. శనివారం బీఆర్‌కే భవన్‌లో కోవిడ్‌–19 నిపుణుల కమిటీతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టిమ్స్‌లో ఐపీ సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తయిందన్నారు. మొత్తం 499 పోస్టులకు 13 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో అర్హులను నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ప్రైవేటు ల్యాబ్‌ల పనితీరుపై నిపుణుల కమిటీ చేసిన తనిఖీల్లో మార్గదర్శకాలు పాటించని వాటిని గుర్తించి, నోటీసులు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ ల్యాబ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తున్న పరీక్షల సంఖ్య, పాజిటివ్‌ కేసుల సంఖ్యలో ఉన్న అవకతవకలపై కమిటీ విస్తృతంగా పరిశీలన చేస్తోందని పేర్కొన్నారు. కొన్ని ల్యాబ్‌లలో 70 శాతం కేసులు పాజిటివ్‌ రావడంపైనా కమిటీ సునిశితంగా పరిశీలన చేయనుందని చెప్పారు.

ఆ తర్వాత ఆయా ల్యాబ్‌ల్లో గుర్తించిన లోపాలు, నివారణ చర్యలు కూడా కమిటీ సూచించనుందని వెల్లడించారు. పొరపాట్లు చేస్తున్న ల్యాబ్‌లకు మంత్రి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రైవేట్‌ ల్యాబ్‌లలో జరుగుతున్న పరీక్షల తీరుపై ప్రభుత్వ ల్యాబ్‌ల మాదిరిగా నిరంతర పర్యవేక్షణ, తరచుగా వాలిడేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అన్నీ ల్యాబ్‌లు ఐసీఎంఆర్, ప్రభుత్వ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ల్యాబ్‌లలో పరీక్షల సంఖ్య పెంచే అంశంపై స్పందిస్తూ పరీక్షల సామర్థ్యం 6,600కు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణం మార్పులతో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు చాలా మంది ప్రజల్లో కనిపిస్తున్నాయని, కరోనా వైరస్‌ సోకిన వారికి సైతం ఇలాంటి లక్షణాలు ఉండటంతో ప్రజల్లో మరింత భయాందోళనలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జంట నగరాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంపైనా మంత్రి సమీక్షించారు. ఈ సమీక్షలో కోవిడ్‌ నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, కరోనా నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రవణ్, ప్రొఫెసర్‌ విమలా థామస్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు