తెలంగాణ ఐపీఎస్‌ల చూపు ఏపీ వైపు

25 May, 2019 02:32 IST|Sakshi

డిప్యుటేషన్‌పై వెళ్లేందుకు ఆరుగురు అధికారుల ఆసక్తి 

వారిలో ముగ్గురు నాన్‌కేడర్‌ ఐపీఎస్‌ అధికారులు 

ఇప్పటికే జగన్‌ని కలిసిన ఓ ఐపీఎస్‌  

ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తే బదిలీ లాంఛనమే 

కేంద్ర సర్వీసులకు ఇద్దరు అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొందరు ఐపీఎస్‌ల చూపు ఇప్పుడు ఏపీ వైపు పడింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో పలువురు ఐపీఎస్‌ అధికారులు ఇంటర్‌స్టేట్‌ డిప్యుటేషన్‌పై వెళ్లే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక, ఐపీఎస్‌ అధికారుల పోస్టింగ్‌ల విషయంలో దృష్టి పెడతారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డితో కలిసి పనిచేసిన ఐపీఎస్‌లలో పలువురు రిటైర్‌ అయ్యారు. అప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉన్న పలువురు ఇప్పుడు జగన్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నారు.  

ఇప్పటికే జగన్‌ని కలిసిన ఓ ఐపీఎస్‌ 
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పలువురు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. కానీ, వీరికి ఇంకా స్థానచలనం లభించలేదు. పదోన్నతులు పొందినా వారు పాతస్థానంలోనే అంటే తమ హోదా కంటే తక్కువ పదవిలో పనిచేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక.. అంటే మే 28 తరువాత స్థానచలనం/ బాధ్యతల మార్పుపై హోంశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఈలోగా ఆరుగురు తెలంగాణ ఐపీఎస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసేందుకు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. వీరిలో ఒక అధికారి ఇప్పటికే విజయవాడ వెళ్లి జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తాను ఏపీలో పనిచేయాలనుకుంటున్నానని తన మనసులో మాట బయటపెట్టుకున్నారు. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం అనంతరం వీరి విజ్ఞప్తులపై ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. 

ఇద్దరు కేంద్ర సర్వీసులకు! 
తెలంగాణ నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు మరో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కూడా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. వీరిలో సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌గా ఉన్న డీఐజీ అకున్‌ సబర్వాల్, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీ(టీఎస్‌పీఏ) డైరెక్టర్‌గా ఉన్న సంతోశ్‌ మెహ్రాలు ఉన్నారని సమాచారం. ఎలక్షన్‌ కోడ్‌ తరువాత వీరి బదిలీకి రాష్ట్ర హోంశాఖ కూడా సుముఖంగా ఉందని, త్వరలోనే పచ్చజెండా ఊపనున్నందని తెలిసింది.

మరిన్ని వార్తలు