తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచి

6 Sep, 2017 02:52 IST|Sakshi
తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచి

► మన పథకాలు అక్కడా అమలు: హరీశ్‌రావు  
► మూడేళ్లలోనే గణనీయమైన మార్పు తెచ్చామని వెల్లడి


సాక్షి, సిద్దిపేట:
తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా మారిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో రూ.215 కోట్లతో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏవీఆర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవ కార్యక్రమంలో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లలోనే గణనీయమైన మార్పు తెచ్చామన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.

మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బిహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని మంత్రి వివరించారు. తాము అమలు చేస్తున్న షీ టీం వ్యవస్థపై బెంగాల్‌ ప్రభుత్వం అధ్యయనం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులు, జర్నలిస్టులకు ప్రవేశపెట్టిన హెల్త్‌ స్కీం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం విద్య, వైద్యం వైపు ప్రజల మొగ్గు  
ప్రజలు ప్రైవేట్‌ను వదిలి ప్రభుత్వ విద్య, వైద్యం వైపు మళ్లారని, ఇది తమ ప్రభుత్వం ఘనత అని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రైవేట్‌ పాఠశాలలు, ఆస్పత్రుల వైపు ప్రజలు పరుగులు పెట్టే వారనీ, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీన్‌ రివర్స్‌ అయిందన్నారు. కార్పొరేట్‌కు దీటుగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, మంచి బోధనతో ప్రైవేట్‌ పాఠశాలలు ఖాళీ అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ఎదుట సీట్లు భర్తీ అయినవి అనే బోర్డులు దర్శనమిస్తున్నాయని చెప్పారు. 

అలాగే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం, కేసీఆర్‌ కిట్స్‌ పంపిణీ, నార్మల్‌ డెలివరీలు మొదలైన సేవలతో ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల వద్దకు ప్రజలు పరుగులు పెడుతున్నారని హరీశ్‌రావు వివరించారు. విద్య, వైద్యంతోనే ప్రజల జీవన విధానం ముడిపడి ఉందన్నారు. ఇందుకోసం గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కేంద్రం చేతులెత్తేసినా మోడల్‌ స్కూల్స్‌ నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు