సంక్షేమ పథకాలతో దేశంలోనే అగ్రగామి

3 Jun, 2017 02:08 IST|Sakshi
సంక్షేమ పథకాలతో దేశంలోనే అగ్రగామి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ 
 
సాక్షి, సంగారెడ్డి: సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్‌ అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016 ఆర్థిక సంవత్సరంలో 17.82 శాతం ఆదాయ వృద్ధి రేటుతో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. జిల్లాల పునర్విభజన అనంతరం ప్రభుత్వ సేవలు ప్రజల ముగింట్లోకి వచ్చాయని, భవిష్యత్‌లో మరిన్ని ఫలాలు అందుతాయని చెప్పారు. రాష్ట్రంలో రూ.40 వేల కోట్లతో 35 సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని సీఎస్‌ వివరించారు.

38 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని, నూతనంగా 510 రెసిడెన్షియల్‌ స్కూల్, ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 36 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లు రుణమాఫీ చేయడంతో పాటు 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందజేస్తున్నామని చెప్పారు.  వివిధ పథకాలతో పాటు  మిషన్‌ భగీరథ, రెండు పడక గదుల ఇళ్లు, విద్య, వైద్యం, సంక్షేమం, పరిశ్రమలు, మహిళా సంక్షేమం, పోలీస్‌ తదితర అంశాలపై వివరించారు. 
మరిన్ని వార్తలు