వంద దేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు

13 Jan, 2019 03:36 IST|Sakshi

నిజామాబాద్‌ ఎంపీ కవిత  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) కీలకపాత్ర పోషించారని, ఉద్యమ భావజాల వ్యాప్తికోసం వివిధ దేశాలలో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు ఏర్పాటు చేసి, స్వరాష్ట్ర సాధనకు కృషి చేశారని ఎంపీ కె.కవిత అన్నారు. ప్రస్తుతం 33 దేశాల్లో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ శాఖలు ఉన్నాయని, రానున్న రోజుల్లో వంద దేశాల్లో శాఖలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ లండన్‌ ఎన్‌ఆర్‌ఐ సంఘం ఎనిమిదో వార్షికోత్సవ సమావేశం తెలంగాణ భవన్‌లో శనివారం జరిగింది. ఈ సభలో కవిత ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ‘ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితో, సూచనలతో తెలంగాణకోసం విదేశాల్లో వివిధ పేర్లతో ఎన్‌ఆర్‌ఐలు సంఘా లు పెట్టి పనిచేశారు.

తెలంగాణ ఉద్యమ సమయం లో ఎన్‌ఆర్‌ఐలు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. అవమానాలు ఎదుర్కొన్నా రాష్ట్రం సాధిం చాం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. తెలంగాణ బిడ్డల అండతో రెండోసారి కూడా టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అనేక కార్యక్రమాల్లో దేశానికి ఆదర్శం గా నిలుస్తోంది. మన పారిశ్రామిక విధానం చూసి అమెరికాలోనూ ఇంతమంచి విధానం లేదని అక్కడి వారు అంటున్నారు.

గల్ఫ్‌లాంటి దేశాల్లో తెలంగాణ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నాం. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో ఎన్‌ఆర్‌ఐ విధానాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ విధానాన్ని ప్రకటిస్తారు. మీరందరూ గర్వపడేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌ సెల్‌ ఇక్కడ పార్టీకి, అక్కడ మన వారికి వారధిలా ఉండాలి. మనమంతా కలిసి పనిచేస్తే దేశానికి, ప్రపంచానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తది’ అన్నారు. ఎమ్మెల్సీ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ సెల్‌ నేతలు కూర్మాచలం అనిల్, దూసరి అశోక్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గవర్నర్‌ను కలిసిన కవిత..
కవిత శనివారం తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహ న్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యువనాయకత్వ సదస్సు ఆహ్వాన పత్రికను గవర్నర్‌కు అందజేశారు. 

మరిన్ని వార్తలు