నేడే టీజేఎస్‌ ఆవిర్భావ సభ

29 Apr, 2018 01:27 IST|Sakshi
శనివారం సరూర్‌నగర్‌ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కోదండరాం

ప్రధాన వేదికపై వెయ్యి మంది

తొలి వరుసలో అన్ని వర్సిటీల విద్యార్థులు 

అమరుల, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకూ వేదికపై చోటు 

ప్రసంగించనున్న హరగోపాల్, నాగేశ్వర్‌ 

ఉద్యమ ఆకాంక్షల కోసమే పార్టీ: కోదండరాం 

టీజేఏసీ చైర్మన్‌ పదవికి రాజీనామా 

రఘుకు బాధ్యతలు అప్పగింత

సాక్షి, హైదరాబాద్‌ : ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో పురుడుపోసుకున్న తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) ఆవిర్భావ సభ ఆదివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో జరగనుంది. దీనికి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించేందుకు నేతలు కసరత్తు చేశారు. సభా వేదికపై 1000 మంది ఆసీనులు కానున్నారు. ఒకే వరుసలో కనీసం 200 మంది కూర్చోవడానికి వీలుగా ఐదు వరుసల్లో స్టేజీ నిర్మాణం జరుగుతోంది. ముందు వరుసలో ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన సహా రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థులు కూర్చుంటారు. 

రెండో వరుసలో అన్ని కోర్టుల న్యాయవాద సంఘాల ప్రతినిధులు, నేతలు, ఆ తర్వాత జేఏసీ స్టీరింగ్‌ కమిటీలో పనిచేసి టీజేఎస్‌లో చేరిన ముఖ్యనేతలు ఆసీనులవుతారు. మహిళా సంఘాల నేతలు, వివిధ రంగాల్లో పేరున్న మహిళలు, తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబీకులు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబీకులు, ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన వారి కుటుంబాలు, ఖమ్మం రైతులు కూడా వేదికపై కూర్చుంటారు. తెలంగాణ కళా సంస్కృతుల ప్రదర్శన కోసం వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు. 800 కళాకారులతో ఒగ్గు కథ, లంబాడీ నృత్యాలు, కోయ, థింసా వంటి అన్ని కళా రూపాలను ప్రదర్శించనున్నారు. 

వేదికపై భవిష్యత్‌ కార్యాచరణ 
ప్రొఫెసర్‌ హరగోపాల్, నాగేశ్వర్‌ ప్రత్యేక వక్తలుగా సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు కళాకారుల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగానే మధ్యమధ్యలో అమరుల కుటుంబాలు, రైతు, విద్యార్థి, న్యాయవాద, ఇతర నేతలు ప్రసంగిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు కోదండరాం వేదికపైకి చేరుకుంటారు. అదే సమయంలో టీజేఎస్‌కు కోదండరాంను అధ్యక్షుడిగా అధికారంగా ప్రకటిస్తారు. అనంతరం ముఖ్యుల ప్రసంగాలు ప్రారంభమవుతాయి. రాత్రి 7.30 లోపు సభ ముగించేందుకు టీజేఎస్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాత్రి 9 గంటల వరకు సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఉన్నా వీలైనంత తొందరగానే ముగించడానికి నిర్ణయించుకున్నారు. పార్టీ ఏర్పాటుకు కారణాలు, లక్ష్యం, భవిష్యత్‌ కార్యాచరణపై టీజేఎస్‌ అధ్యక్షుడిగా కోదండరాం సభలో వివరించనున్నారు.  

ఉద్యమ ఆకాంక్షల సాధనే లక్ష్యం: కోదండరాం 
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలకు తావు లేకుండా పోయిందని ఎం.కోదండరాం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక హక్కులు లేకుండా పోయాయని, సమస్యలున్నాయని చెప్పుకోవడానికి వేదికలు కూడా లేకపోవడం అత్యంత బాధాకరమని ‘సాక్షి’తో పేర్కొన్నారు. ‘‘నిరుద్యోగంతో యువత క్షోభ పడుతోంది. రైతుల సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి. 

యువతకు ఉద్యోగాల భర్తీ కోసం కేలండర్‌ను ప్రకటించాలని, ఉపాధి కోసం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేసి, రైతుల మౌలిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు’’ అని విమర్శించారు. అధికారం ఒకే కుటుంబానికి పరిమితమైందని, మంత్రులు, అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయతలో ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమం ఏ లక్ష్యాల కోసం సాగిందో వాటిని సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. 

టీజేఏసీకి కోదండరాం రాజీనామా 
టీజేఏసీ చైర్మన్‌ పదవికి కోదండరాం రాజీనామా చేశారు. తెలంగాణ జన సమితిలో చేరుతున్నందున రాజీనామా చేస్తున్నట్టుగా శనివారం ప్రకటించారు. జేఏసీ నేతలతో కలిసి అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించారు. అనంతరం తన రాజీనామా లేఖను టీజేఏసీ కన్వీనర్‌ కె.రఘు అందించారు. చైర్మన్‌ పదవిలో లేకుంటే కన్వీనర్‌గా ఉన్న వారే పూర్తి బాధ్యుడిగా వ్యవహరిస్తారు. దీని ప్రకారం టీజేఏసీ చైర్మన్‌గా రఘు వ్యవహరించనున్నారు. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమై జేఏసీ చైర్మన్, ఇతర కమిటీని ఎన్నుకోనున్నారు. పూర్తిస్థాయి చైర్మన్‌గా రఘును స్టీరింగ్‌ కమిటీ ఎన్నుకోనుంది. 

2009 డిసెంబర్‌లో ఆవిర్భవించిన టీజేఏసీకి కోదండరాం వ్యవస్థాపక చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రతిపాదన మేరకు అప్పుడు జేఏసీ భాగస్వామ్య పార్టీల ప్రతినిధులుగా కె.చంద్రశేఖర్‌రావు(టీఆర్‌ఎస్‌ అధినేత), కె.జానారెడ్డి(కాంగ్రెస్‌), నాగం జనార్దన్‌రెడ్డి(టీడీపీ)తో పాటు బీజేపీ, న్యూడెమొక్రసీలతోపాటు టీఎన్‌జీవో, టీజీవో, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ మాల మహానాడు వంటి రాజకీయేతర సామాజిక, ఉద్యోగసంఘాల ప్రతినిధులంతా కోదండరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ సాధన కోసం మిలియన్‌ మార్చ్, సాగరహారం వంటి భారీ కార్యక్రమాలను జేఏసీ నిర్వహించింది. జేఏసీకి చైర్మన్‌గా కోదండరాం తొమ్మిదేళ్లుగా నాయకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమంలో తనకు సహకరించిన రాజకీయ పార్టీలు, ఉద్యమ సంఘాలకు, మీడియాకు ఈ సందర్భంగా కోదండరాం కృతజ్ఞతలను తెలియజేశారు. 

మరిన్ని వార్తలు