ఎన్నాళ్లో వేచిన ఉదయం

2 May, 2020 02:31 IST|Sakshi
శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లోని లింగంపల్లి  రైల్వేస్టేషన్‌లో జార్ఖండ్‌కు వెళ్లే ప్రత్యేక రైలు ఎక్కుతున్న వలస కూలీలు..

లింగంపల్లి నుంచి బయల్దేరిన తొలి రైలు

1,225 మంది వలస కూలీలతో జార్ఖండ్‌లోని హతియాకు పయనం

రైలు బయల్దేరే వరకు సమాచారం బయటకు పొక్కొద్దని రైల్వే బోర్డు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌/సంగారెడ్డి: లాక్‌డౌన్‌తో ఇరుక్కుపోయిన వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులు ఊపిరి పీల్చు కుంటున్నారు. వారిని వారి స్వస్థలాలకు తరలింపు మొద లైంది. వారిని రైళ్ల ద్వారా తర లించాలని కేంద్రం నిర్ణయిం చింది. ఈ మేరకు రైల్వే బోర్డు అనుమతి ఇవ్వటంతో ఆ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా 1,225 మంది వలస కూలీలతో కూడిన తొలి రైలు శుక్రవారం ఉదయం 4.50కి లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌లోని హతి యాకు బయల్దేరింది. సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఈ వలస కూలీలు లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

చివరకు ఆందోళనకు దిగటం, అది కాస్తా ఉద్రిక్తతకు దారితీయటం, పోలీసు వాహనాలు ధ్వంసం కావటానికి దారితీసిన సంగతి తెలిసిందే. వారిని స్వస్థలాలకు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి విషయాన్ని కేంద్రం దృష్టికి తీసు కెళ్లటంతో రైలు ద్వారా తరలింపునకు అంగీకరిం చింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్, ఈ తరలింపు వ్యవహా రాన్ని పర్యవేక్షించే నోడల్‌ అధి కారి సుల్తానియా తదితరులు అర్ధరాత్రి వరకు పర్యవేక్షించి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇలా వేరే ప్రాంతాలకు చెంది లాక్‌ డౌన్‌ వల్ల మరో చోట ఇరుక్కు పోయిన వారందరినీ రైళ్ల ద్వారా తరలించాలని కేంద్రం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోగా ఆ తర్వాత పట్టాలెక్కిన తొలి రైలు ఇదే. చదవండి: తెలంగాణలో 6 రెడ్‌ జోన్‌ జిల్లాలు 

ముందు ప్రకటించకుండా..
హైదరాబాద్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన లక్షల మంది ఉంటున్నారు. సెలవు రోజుల్లో వీరు సొంత ప్రాంతాలకు వెళ్లి వస్తుండటం సహజం. లాక్‌డౌన్‌ వల్ల వీరు గత 40 రోజులుగా ఇక్కడే ఉండిపోయారు. లాక్‌డౌన్‌కు ఎప్పుడు విముక్తి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాగోలా సొంత ప్రాంతాలకు వెళ్లాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొందరు కాలినడకన వెళ్తుండగా, కొందరు అక్రమంగా వాహనాల్లోని సరుకుల మధ్య కూర్చుని వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఏపీకి చెందిన వేలాది మంది ప్రత్యేక అనుమతి పొంది సరిహద్దు వరకు వెళ్లగా, అక్కడి అధికారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. చివరకు క్వారంటైన్‌కు అంగీకరించిన కొందరు మాత్రమే వెళ్లగలిగారు. మిగతావారు తిరిగి నగరానికి వచ్చారు.

ఇప్పుడు వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను వారి ప్రాంతాలకు తరలించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపటంతో, వారి మాటున ఉద్యోగులు, ఇతరులు కూడా వెళ్లేందుకు యత్నిస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువగా ఉండటంతో తరలించటం సాధ్యం కాదు. వలస కూలీల కోసం రైళ్లను నడుపుతున్న సంగతి ముందే తెలిస్తే.. వీరు కూడా పెద్ద సంఖ్యలో ఆయా స్టేషన్లకు వచ్చే ప్రమాదం ఉందని రైల్వే భావిస్తోంది. ఇటీవల ముంబైలో ఇలాగే వేల సంఖ్యలో వలస కూలీలు స్టేషన్‌కు రావటంతో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో రైల్వే అధికారులు ఈ రైలు విషయాన్ని గోప్యంగా ఉంచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత గానీ స్థానిక స్టేషన్‌ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. ఉదయం రైలు బయల్దేరే వరకు అదే విభాగంలోని మిగతావారికి కూడా తెలియకపోవటం విశేషం.

ఓ నేత హడావుడితో గందరగోళం..
రాష్ట్రంలో ఇరుక్కుపోయిన వేరే ప్రాంతాల వారిని రైళ్ల ద్వారా తరలించనున్నట్లు ఓ ముఖ్య నేత శుక్రవారం బాహాటంగా ప్రకటించటం గందరగోళంగా మారింది. రైళ్లను నడిపి వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను తరలించనున్నామని కేంద్రం సమాచారం ఇచ్చిందని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఉంటున్న వేరే ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు రైల్వే అధికారులకు ఫోన్లు చేసి తమను కూడా తరలించాలని పేర్కొనటం ప్రారంభించారు. దీంతో విషయాన్ని రైల్వే అధికారులు రైల్వే బోర్డు దృష్టికి తెచ్చారు. రైళ్లు ఆపరేట్‌ చేస్తున్న విషయాన్ని బాహాటంగా ప్రకటించొద్దని, గోప్యంగా ఉంచాలని, వేరే వాళ్లు వస్తే సమస్యలు ఏర్పడతాయని పేర్కొన్నారు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు చెందిన వారు ఏ రోజు ఎక్కడి నుంచి రైళ్లు నడుపుతారో తెలుసుకునే పనిలో పడ్డారు. చదవండి: వలస కూలీలు ఓటర్లు కారనుకున్నారా? 

రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాకే..
వలస కూలీలు, విద్యార్థులు, పర్యాటకులను పంపే క్రమంలో తెలంగాణతో పాటు, వారు వెళ్లాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం చర్చించుకుని ఏకాభిప్రాయానికి వస్తేనే రైళ్లు నడపనున్నట్టు రైల్వే బోర్డు పేర్కొంటోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు అనుసరిస్తూ రైల్వే స్టేషన్‌కు తెచ్చే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని, వారు దిగిన తర్వాత వారిని క్వారంటైన్‌ చేయటమా, ఇతర షెల్టర్లకు పంపటమా, ఇళ్లకు చేర్చటమా అని నిర్ణయించి తరలించే బాధ్యత అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని బోర్డు స్పష్టం చేసింది. వారికి భోజన, పానీయాల వసతి కూడా రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలని, ప్రయాణ సమయం ఎక్కువగా ఉంటే మాత్రం రైల్లో వారికి భోజనం, నీళ్లు అందిస్తామని రైల్వే బోర్డు నిర్ణయించింది.

అన్నీ తానై నడిపించిన స్టీఫెన్‌ రవీంద్ర..
లాక్‌ డౌన్‌ కారణంగా హైదరాబాద్‌లో చిక్కుకున్న బిహార్, ఒడిశాకు చెందిన 1,200 కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలించడం వెనుక జరిగిన పోలీస్‌ ఆపరేషన్‌ ఫలించింది. ఈ మొత్తం ఆపరేషన్‌ను వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర అత్యంత రహస్యంగా, విజయవంతంగా పూర్తి చేశారు. ఏడీజీ జితేందర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్టీఫెన్‌ రవీంద్ర.. బుధవారం రాత్రే కూలీల వద్దకు వెళ్లారు. అందరినీ సొంత రాష్ట్రాలకు పంపుతామని వారికి హామీ ఇచ్చి వారిని శాంతింపజేశారు. ఎప్పుడు, ఎలా పంపుతారన్న విషయం ఆఖరు నిమిషం వరకు కూలీలకు కూడా తెలియనివ్వలేదు. గురువారం రాత్రి 12 గంటల నుంచి 1.30 గంటల వరకు మొత్తం 1,200 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందరికి నెగెటివ్‌ వచ్చింది. అప్పుడే లింగంపల్లి రైల్వే అధికారులకు కూలీలను తీసుకొస్తున్నామని పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెప్పించిన దాదాపు 30కి పైగా బస్సుల్లో తరలించారు. తెల్లవారుజామున 2.30 తర్వాత బస్సులు లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరాయి. ప్రత్యేక రైలులో అంతా ఎక్కాక వారికి ఆహారం, వాటర్‌ అందించారు. తెల్లవారుజామున 3.30 గంటలు దాటాక రైలు బయల్దేరింది.

మరిన్ని వార్తలు