కలెక్టర్ల భేటీలో కాగ్నా వివాదానికి తెర!

22 Dec, 2018 02:45 IST|Sakshi
ఇరు రాష్ట్రాల సరిహద్దు నక్షలను పరిశీలిస్తున్న కలెక్టర్లు ఉమర్‌ జలీల్,వెంకటేశ్‌కుమార్‌

అంతర్రాష్ట్ర సరిహద్దులపై వికారాబాద్, గుల్బర్గా కలెక్టర్ల చర్చలు 

సమాన వాటాలపై తెలంగాణ, కర్ణాటక అంగీకారం 

కన్నడిగులు 10 నుంచి 30 మీటర్ల మేర చొచ్చుకొచ్చినట్లు గుర్తింపు 

హద్దులు తేల్చి రాళ్లు పాతిన సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు

బషీరాబాద్‌: కాగ్నా నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం కాద్గిరా– పోతంగల్‌ దగ్గర కాగ్నా నదిలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ఇసుక తవ్వకాలు గురువారం వివాదాస్పదమైన సంగతి విదితమే. సరిహద్దుల విషయంలో బషీరాబాద్‌ చించొళ్లీ రెవెన్యూ, పోలీసుల మధ్య వాగ్వాదాలతో సమస్య మరింత జఠిలమవ్వడంతో, చివరకు వికారాబాద్, గుల్బర్గా జిల్లాల కలెకర్లు ఉమర్‌ జలీల్, జి. వెంకటేశ్‌ కుమార్‌ రంగంలోకి దిగారు. శుక్రవారం వివాదాస్పద కాగ్నా నదిలో ఇరువురు జిల్లా ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఇరురాష్ట్రాల సరిహద్దు నక్షలు, భూ రికార్డులను పరిశీలించారు. అయితే రెండు రాష్ట్రాల నక్షల ప్రకారం తమకంటే తమకే ఎక్కువ వాటాలు వస్తాయని ఏడీఎస్‌ఎల్‌ఆర్‌ అధికారులు తెలిపారు.

వీటితో సమస్య పరిష్కారం కాదని భావించిన ఇద్దరు కలెక్టర్లు రాజీ మార్గంగా ఉమ్మడి సర్వే చేయించి నదిలో సమాన భూ భాగం పంచుకోవడానికి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. నదికి ఇరువైపులా ఉన్న రైతుల పట్టాభూముల బౌండరీలను గుర్తించి, మిగిలిన నదీ భాగంలో రెండు సమాన భాగాలుగా పంచుకోవాలని నిర్ణయించారు. వెంటనే కలెక్టర్లు, నదిలో కర్ణాటక అధికారులు పాతిన హద్దురాళ్లు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య స్నేహ పూర్వక వాతావరణం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలు ఎక్కడ ఉన్నా సామరస్యంగా పరిష్కరించుకుంటామని సంయుక్తంగా ప్రకటించారు. నదీ భూ భాగంలో ఇరు ప్రభుత్వాలకు సమాన వాటా తీసుకోవడానికి అంగీకరించామని, ఇక సరిహద్దు సమస్య ఏమీ ఉండదన్నారు. నీళ్లపల్లి దగ్గర అటవీ భూమికి చెందిన సరిహద్దు సమస్యను కూడా త్వరలో తేలుస్తామని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

10 నుంచి 30 మీటర్లు చొచ్చుకొచ్చిన కన్నడిగులు...
కాగ్నాలో రెండు జిల్లాల సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ డైరెక్టర్లు నరహరిరావు, జిదగేధర్‌ ఆధ్వర్యంలో డీజీపీఎస్‌ శాటిలైట్‌ సర్వేచేశారు. నదికి ఇరువైపుల ఉన్న కాద్గిరా – పోతంగల్‌ గ్రామాల రైతుల పట్టా భూముల హద్దులను గుర్తించారు. మిగిలిన నదీ భాగంలో సర్వే చేయగా కర్ణాటక అధికారులు కిలోమీటరు పొడవులో 10 నుంచి 30 మీటర్ల మేర తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకొచ్చినట్లు బహిర్గతమైంది. దీంట్లో కొంత మేర తెలంగాణ నదీభాగంలో కన్నడిగులు ఇసుక తవ్వకాలు చేసినట్లు గుర్తించారు. నదికి ఇరువైపులా ఉన్న హద్దులతో రెండు రాష్ట్రాలకు సమాన భాగాలను గుర్తించి హద్దురాళ్లు పాతారు. కార్యక్రమంలో సేడం రెవెన్యూ అసిస్టెంట్‌ కమిషనర్‌ బి.సుశీల, గుల్బర్గా ట్రైనీ కలెక్టర్‌ సుధర్‌ స్నేహల్‌లొకండే, తాండూరు ఆర్డీఓ వేణుమాధవ్‌రావు, మైన్స్‌ అధికారులు రేణుకాదేవి, రవికుమార్, జియాలజిస్ట్‌ రామారావు, చించొళ్లీ, బషీరాబాద్‌ తహసీల్దార్లు పండిత్‌ బీరాధర్, ఉమామహేశ్వరి, డీఎస్పీలు రామచంద్రుడు, బస్వరాజు రెవెన్యూ, మైన్స్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు