వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ టు పీజీ: కడియం

22 Mar, 2017 02:26 IST|Sakshi
వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ టు పీజీ: కడియం

ప్రాథమిక పాఠశాలలతో అంగన్‌వాడీ కేంద్రాల అనుసంధానం
ఐదు నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో విద్య
డిగ్రీ, పీజీలకు రీయింబర్స్‌మెంట్‌.. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య


సాక్షి, హైదరాబాద్‌: ‘‘అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానిస్తాం. ఐదో తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకులాల్లో ఉచిత విద్య ఉంటుంది. డిగ్రీ, పీజీలకు ఫీజు రీయిం బర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. మొత్తంగా ‘కేజీ టు పీజీ’వచ్చే విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి వస్తుంది..’’అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 529 గురుకుల పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మంగళవారం శాసనసభలో విద్యా సంబం ధిత అంశాల పద్దుపై జరిగిన చర్చలో కడి యం మాట్లాడారు. ఇప్పటికే ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించామని, మరో ఐదు వేల పాఠశా లల్లో ప్రారంభించనున్నామని తెలిపారు.

మూడేళ్లుగా ఏం చేశారు?
తొలుత ఈ అంశంపై కాంగ్రెస్‌ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడారు. ఎన్నికల ప్రణాళికలో కేజీ టు పీజీని పొందుపరిస్తే పేద ప్రజలు ఎంతో సంతోషించారని.. కానీ ఆ పథకం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే పరిమితమైందని విమర్శించారు. ఇంటర్‌ విద్య అందుబాటులో లేక మారుమూల ప్రాంతాల్లోని బాలికలు పదో తరగతితో చదువు ఆపేస్తున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య పేర్కొన్నారు. మండల కేంద్రాల్లో ఇంటర్, నియోజకవర్గ కేంద్రాల్లో డిగ్రీ కళాశాల ఉండేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ సభ్యుడు జీవన్‌రెడ్డి కోరారు. కాలేజీలు మంజూరు చేస్తూ కాగితాలు వస్తున్నాయని.. కానీ భవనాలు, ఫర్నీచర్, అధ్యాపకులు లేకుంటే ఎలా నడుస్తాయని కాంగ్రెస్‌ సభ్యుడు సంపత్‌ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి కడియం వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో మ్యాపింగ్‌ చేశామన్నారు.   భవనాలు, ఫర్నిచర్, ఇతర అవ సరాల కోసం 480 కోట్లు కేటాయించామన్నారు.

ఎమ్మెల్యేల ఇళ్ల డిజైన్‌లో వాస్తు లోపం!
నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మె ల్యేలకు కట్టిస్తున్న క్యాంపు కార్యా లయం, నివాస సముదాయ భవన నమూనాలో వాస్తుదోషం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం ఉందని ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌ ప్రస్తావించారు. ఎమ్మెల్యేల తల్లి దండ్రులు కూడా ఉండేందుకు మరో బెడ్‌రూం నిర్మించాలని.. నిర్మాణ వ్యయాన్ని రూ.రెండు కోట్లకు పెం చాలని కోరారు. మంత్రి తుమ్మల సమాధానమిస్తూ.. ఎమ్మెల్యేల ఇళ్ల నమూనాలో ఎలాంటి వాస్తు దోషం లేదని తెలిపారు. ఇంధనాన్ని పొదుపు చేసే ఆర్టీసీ సిబ్బందికి ప్రోత్సాహకాల మొత్తాన్ని పెంచాలని  ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు