ఏరువాక సాగారో..

29 Jun, 2016 03:25 IST|Sakshi

ఊపందుకున్న ఖరీఫ్  ఇప్పటివరకు 28 లక్షల ఎకరాల్లో పంటల సాగు
మెదక్ జిల్లాలో అత్యధికంగా 43 శాతం నల్లగొండ జిల్లాలో అత్యల్పంగా 6 శాతమే

 
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో పంటల సాగు ఊపందుకుంది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గత వారంతో పోలిస్తే ఈ వారం రెట్టింపు స్థాయిలో పంటల సాగు నమోదైంది. ఇప్పటివరకు 26 శాతం పంటల సాగు జరిగినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 28 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా పత్తి 12.12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగైంది. గతేడాది పత్తి సాధారణ విస్తీర్ణం 40.31 లక్షల ఎకరాలు కాగా... ఈసారి 26.28 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఏకంగా 14.03 లక్షల ఎకరాలు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే సాధారణ సాగు విస్తీర్ణంలో దాదాపు సగం వరకు సాగైంది. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌ను సాగు చేయాలని ప్రభుత్వం పిలుపునిచ్చినా... ఇప్పటివరకు కేవలం 4.02 లక్షల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈసారి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 12.39 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించారు. కానీ ఇప్పటివరకు మూడో వంతుకే పరిమితమైంది. సోయా వేయడానికి ఈ నెలాఖరు వరకే అవకాశముంది. ఆ తర్వాత సోయా సాగుకు అనుకూల సమయం కాదు కాబట్టి వచ్చే నెలంతా పత్తినే సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఆహారధాన్యాల సాగు సాధారణ విస్తీర్ణం 48 లక్షల ఎకరాలు కాగా..  ఇప్పటివరకు 11.27 లక్షల ఎకరాల్లో సాగైంది. అందులో పప్పుధాన్యాల సాగు 55 శాతం ఉంది.               

- సాక్షి, హైదరాబాద్
 
 మెదక్‌లో ఎక్కువ.. నల్లగొండ లో తక్కువ
 రాష్ట్రంలోనే అధికంగా మెదక్ జిల్లాలో పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో 42.91 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. 11.36 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాధారణ సాగు జరగాల్సి ఉండగా.. ఇప్పటివరకు 4.87 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. నల్లగొండ జిల్లాలో మాత్రం అతి తక్కువగా పంటలు సాగయ్యాయి. ఆ జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 14.50 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 94,952 ఎకరాల్లోనే (6.55%) పంటలు సాగయ్యాయి. ఆదిలాబాద్‌లో 39.59 శాతం, నిజామాబాద్‌లో 36.12 శాతం, రంగారెడ్డిలో 33.84 శాతం, ఖమ్మంలో 24.99 శాతం, వరంగల్‌లో 23.59 శాతం, మహబూబ్‌నగర్‌లో 23.13 శాతం, కరీంనగర్ జిల్లాలో 18.37 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి.
 
 జోరుగా వర్షాలు
 తెలంగాణలో గత వారంలో ఐదు శాతం లోటు వర్షపాతం నమోదు కాగా.. ఈ వారంలో వర్షాలు విస్తారంగా కురిశాయి. 25 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 93 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఆ జిల్లాలో సాధారణంగా జూన్ ఒకటో తేదీ నుంచి మంగళవారం వరకు 66.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఏకంగా 127.5 మి.మీ. నమోదైంది. ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 84 శాతం అధిక వర్షపాతం రికార్డు అయింది. ఆ జిల్లాలో ఇప్పటివరకు సాధారణంగా 118.5 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా.. 217.5 మి.మీ. కురిసింది. తర్వాత నల్లగొండ జిల్లాలో 85.2 మిల్లీమీటర్లకు గాను 133.1 మిల్లీమీటర్లు (56 శాతం అధికం) కురిసింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మాత్రం లోటు వర్షపాతం నమోదవుతోంది.
 
 మిరప, కంది, పెసర విత్తనాలకు కొరత
 దాదాపు అన్ని విత్తనాలనూ అందుబాటులో ఉంచిన సర్కారు.. మిరప, కంది, పెసర విత్తనాలను మాత్రం పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచలేదు. పత్తికి ప్రత్యామ్నాయంగా సోయాబీన్‌తోపాటు కంది, పెసర అధికంగా సాగు చేయాలని వ్యవసాయశాఖ పిలుపునిచ్చింది. కానీ ఆయా విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. కంది విత్తనాలు 8,100 క్వింటాళ్లు, పెసర 10 వేల క్వింటాళ్లు, మినప 6 వేల క్వింటాళ్లు సరఫరా చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఈ విత్తనాలను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడంతో ఖమ్మం, వరంగల్ తదితర జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మిరప విత్తనాలను ప్రైవేటు కంపెనీలే సరఫరా చేస్తున్నాయి. అయితే వాటి సరఫరాపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం.. కంపెనీలు పూర్తిస్థాయిలో సరఫరా చేయకపోవడంతో కొరత ఏర్పడింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రైతులు బ్లాక్‌మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
 
 పంటల సాగు విస్తీర్ణం (లక్షల ఎకరాల్లో)
 జిల్లా                          సాధారణ     ఇప్పటివరకు    సాగు
                                  సాగు        సాగైంది    శాతం
 రంగారెడ్డి                     5.43        1.83    33.84
 నిజామాబాద్               8.07        2.91    36.12
 మెదక్                      11.36        4.87    42.91
 మహబూబ్‌నగర్         19.19        4.44    23.13
 నల్లగొండ                   14.50        0.95    6.55
 వరంగల్                    12.80        3.02    23.59
 ఖమ్మం                      9.87        2.46    24.99
 కరీంనగర్                  13.03        2.39    18.37
 ఆదిలాబాద్                14.32        5.67    39.59
 మొత్తం                    108.60        28.57    26.31

>
మరిన్ని వార్తలు