బోటు ప్రమాదం : 6.3 లక్షల చొప్పున సాయం

29 Oct, 2019 19:49 IST|Sakshi

కార్మిక శాఖ తరపున అందించిన తెలంగాణ ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించింది. కార్మిక శాఖ తరపున రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.6.30 లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది.  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ముఖ్య కార్యదర్శి శశాంక్ గోయల్ బాధిత కుంటుంబ సభ్యులకు చెక్కులు అందజేశారు. పడవ ప్రమాదంలో చనిపోయిన గొర్రె రమాదేవి, బస్కె రేణుక, కొమ్ముల పుష్ప, కొండూరు కౌసల్య, బస్కె లలితకు కార్మిక శాఖ తరపున గుర్తింపు కార్డులు ఉన్నాయి.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘ప్రమాదంలో చనిపోవడం బాధాకరం. అయినా వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం కొంత ఊరట. కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి ఇచ్చే పరిహారం మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.6.30 లక్షలకు పెంచారు. సీఎం ఆదేశాల మేరకు పడవ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లి బాధిత  కుటుంబ సభ్యులకు అండగా ఉన్నాం. మృతుల కుటుంబాలకు సీఎం  కేసీఆర్‌ రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి అండగా నిలిచారు. 

తెలంగాణకు చెందిన మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ రాష్ట్రం వారితో సమానంగా పరిహారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. బోటు ప్రమాదంలో చనిపోయిన కార్మికులకు గుర్తింపు కార్డులు వచ్చేలా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారి ప్రీమియం మొత్తం చెల్లించి కార్మికులకు అండగా ఉన్నారు’అని చెప్పారు.

మరిన్ని వార్తలు