జాతీయ పండుగగా గుర్తించండి

2 Aug, 2019 07:19 IST|Sakshi
కేంద్రమంత్రికి ఆహ్వానపత్రం అందిస్తున్న నామా నాగేశ్వర్‌రావు, చిత్రంలో కొప్పుల

మేడారం జాతరపై కేంద్రాన్ని కోరిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జాతరకు రావాల్సిందిగా కేంద్రమంత్రికి ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి అర్జున్‌ముండాను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆహ్వానించారు. ఈమేరకు గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలసి ఆహ్వానపత్రాన్ని అందించారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్కండ్‌ రాష్ట్రాల నుంచి కోట్లాది మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారని మంత్రి వివరించారు. దక్షిణ కుంభమేళాగా భావిస్తున్న మేడారం జాతరను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా ప్రకటించాలని కోరారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం జాతర జరుగుతుందన్నారు. దీని నిర్వహణకు దాదాపు రూ.110 కోట్లు అవసరమవుతాయని, రాష్ట్ర గిరిజన శాఖ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలను కేంద్రమంత్రికి అందజేశారు. ఈ జాతర నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం తనవంతు బాధ్యతగా ముందుకొచ్చి నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వసతి గృహ నిర్మాణాలకు నిధులివ్వండి 
ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతి గృహాల నిర్మాణాలు, సౌకర్యాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలసి కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలేకు వినతిపత్రం సమర్పించారు.

>
మరిన్ని వార్తలు