తెలంగాణ గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి

26 Jun, 2015 18:23 IST|Sakshi
తెలంగాణ గజల్ గాయకుడు విఠల్‌రావు మృతి

గాంధీ ఆస్పత్రి (సికింద్రాబాద్) : తొలితరం తెలంగాణ గజల్ గాయకుడు శివపూర్‌కర్ విఠల్‌రావు(86) మృతి చెందారు. గాంధీ మార్చురీలో భధ్రపరిచిన మృతదేహం తన తండ్రి విఠల్‌రావుదేనని ఆయన కుమారుడు సంతోష్ శుక్రవారం గుర్తించాడు. ఈనెల 24వ తేదీన బేగంపేట కంట్రీక్లబ్ ఫ్లై ఓవర్ కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న విఠల్‌రావును యాచకునిగా భావించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చేర్పించగా, అదేరోజు అర్థరాత్రి దాటిన తర్వాత ఆయన మృతిచెందారు. గుర్తుతెలియని మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గాంధీ మార్చురీలో భధ్రపరిచారు. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్యాంబాబు చొరవతో మృతిచెందింది గజల్‌ గాయకుడు విఠల్‌రావుగా వెల్లడైంది.

హైదరాబాద్ గోషామహల్, హిందీనగర్‌కు చెందిన విఠల్‌రావుకు ఐదుగురు సంతానం. సంజయ్, సంతోష్‌లు కుమారులు, సంధ్య, వింధ్య, సీమలు కుమార్తెలు. మతిమరుపు వ్యాధి (ఆల్జీమర్)గల విఠల్‌రావు గతనెల 29వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి సాయినాధుని దర్శనానికి షిరిడీ వెళ్లి అక్కడ తప్పిపోయారు. షిరిడీ పరిసర ప్రాంతాలు గాలించినా ఫలితం లేకపోవడంతో అక్కడి ఠాణాలో ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

సన్మానానికి పిలుపు..

తెలంగాణ పరగణాల్లో గజల్ గాయకునిగా ప్రఖ్యాతి పొందిన విఠల్‌రావును తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. జూన్ 2 వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విఠల్‌రావుకు సన్మానం చేస్తామని ప్రకటించి ఈమేరకు ఆయనకు సమాచారం కూడా అందించారు. ఇంతలోనే విఠల్‌రావు అదృశ్యమయ్యారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం విఠల్‌రావు అదృశ్యం మిస్టరీని చేధించాలని పోలీసులను ఆదేశించింది. సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్యాంబాబు నేతృత్వంలో దర్యాప్తులో భాగంగా విఠల్‌రావు ఫొటోలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాలకు పంపించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో పోస్టర్లను అతికించారు.

గుర్తింపుకు కృత్రిమకన్నే ఆధారం..

గుర్తించలేని విధంగా ఉన్న విఠల్‌రావు మృతదేహన్ని గుర్తించేందుకు కృత్రిమంగా అమర్చిన కన్నే ప్రధాన ఆధారమైంది. విఠల్‌రావు అదృశ్యంపై చేపట్టిన దర్యాప్తులో భాగంగా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శ్యాంబాబు గాంధీ మార్చురీలోని అనాథ మృతదేహాల ఫోటోలను పరిశీలిస్తుండగా.. విఠల్‌రావును పోలిన మృతదేహం ఫొటో కనిపించింది. ఆయన కుమారుడు సంతోష్‌ను శుక్రవారం ఉదయం గాంధీ ఆస్పత్రికి తీసుకువచ్చారు. మృతదేహం డీకంపోజ్ కావడంతో గుర్తుపట్టడం కష్టంగా మారింది. కొన్నేళ్ల క్రితం విఠల్‌రావు ఎడమకన్నును తొలగించి కృత్రిమ కన్ను అమర్చారు. దీని ఆధారంగా మృతదేహం విఠల్‌రావుదిగా అతని కుమారుడు సంతోష్ గుర్తించాడు. విఠల్‌రావు ఆచూకీ కోసం కొంతమంది కుటుంబసభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లారని, వాళ్లందరికీ సమాచారం అందించామని, శనివారం నాడు గోషామహల్‌లోనే తమ తండ్రి విఠల్‌రావు అంత్యక్రియలు నిర్వహిస్తామని అతని కుమారుడు సంతోష్ తెలిపారు.

 

సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ గజల్ గాయకుడు విఠల్‌రావు మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏడో నిజాం ఆస్థానంలో విధ్వాంసుడిగా పని చేసిన విఠల్‌రావు దేశవ్యాప్తంగా పేరొందిన కళాకారుడని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి పారితోషికాన్ని అందించింది. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 

మరిన్ని వార్తలు