తెలంగాణ పోలింగ్‌; తెలంగాణలో ముగిసిన పోలింగ్‌

11 Apr, 2019 07:09 IST|Sakshi

► తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెలంగాణ వ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా.. నిజామాబాద్‌లో 6 గంటల వరకు కొనసాగింది. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల యత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

► నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం మినహా తెలంగాణలో సాయంత్రం 5గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూ లైన్లలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. నిజామాబాద్‌లో సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

► తెలంగాణలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 48.95 శాతం పోలింగ్‌ నమోదయింది. నియోజకవర్గాల వారీగా పోలింగ్‌ శాతం..

ఆదిలాబాద్‌- 57.04%
పెద్దపల్లి- 54.83%
కరీంనగర్‌- 58.10%
నిజామాబాద్‌- 45.29%
జహీరాబాద్‌- 63.39%
మెదక్‌- 62.50%
మల్కాజ్‌గిరి- 36.39%
సికింద్రాబాద్‌- 30.20%
హైదరాబాద్‌- 27.79%
చెవేళ్ల- 40.45%
మహబూబ్‌నగర్‌- 56.00%
నాగర్‌ కర్నూలు- 51.50%
నల్గొండ- 58.21%
భువనగిరి- 57.41%
వరంగల్‌- 51.50%
మహబూబ్‌బాద్‌- 55.24%
ఖమ్మం- 54.80%

► వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రాజశేఖర్‌, జీవితలు జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► తెలంగాణలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగిసింది. అయితే 4గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు.   

► మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 36.39 శాతం పోలింగ్‌ నమోదయింది.

► తెలంగాణలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 58.10 శాతం పోలింగ్‌ నమోదయింది. మహబూబ్‌నగర్‌లో 48 శాతం, నాగర్‌ కర్నూల్‌ 51.5 శాతం, ఖమ్మంలో 54.80 శాతం ఓటింగ్‌ నమోదయింది.

► జగిత్యాల ఎస్పీ సింధు శర్మ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► సిద్దిపేట మండలంలోని ఇబ్రహీంపూర్ పోలింగ్ బూత్ ముందు మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ బైఠాయించి నిరసన తెలిపారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఉదయం పోలింగ్‌ బూత్‌లో తమ పార్టీ ఏజెంట్ పై దాడికి పాల్పడటంతో పాటు, రిగ్గింగ్ చేశారని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు కరీంనగర్‌లో 45.62 శాతం, ఖమ్మంలో 41.62 మహబూబాబాద్‌లో 47.29, వరంగల్‌లో 40.24 శాతం నమోదయింది.

ఖమ్మంలో తన గెలుపు ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆమె మీడియాతో ట్లాడుతూ.. విజయంపై ఆశాభావంతో ఉన్నట్టు చెప్పారు. ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలోని మార్కెట్ యార్డు పోలింగ్ బూత్‌లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా మధిర సెంట్ ఫ్రాన్సెస్ హైస్కూల్‌లో ఓటు వేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి సోయం బాపూరావు బోథ్ మండలం ఘన్పూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఉదయం 11 గంటలకు 22.84 శాతం పోలింగ్‌ నమోదయింది. తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్‌ కోదండరాం తార్నాక కమ్యూనిటీ హాల్ పోలింగ్ బూత్ 195లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఓటు వేశారు. వరంగల్ అర్బన్ ఖిలావరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలోని 231 పోలింగ్ బూత్‌లో వరంగల్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధిపేట జిల్లా చింతమడకలో ఓటు వేశారు. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌ నుంచి రోడ్డు మార్గాన నేరుగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వెంటనే మీడియాతో మాట్లాడకుండానే ఆయన వెళ్లిపోయారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, ఆయన సతీమణి శైలిమ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని, ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొంటున్నారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందన్నారు. బేగంపేటలోని కుందన్‌బాగ్ చిన్మయ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

సంగారెడ్డి జిల్లా కొహిర్ మండలం గురుజాడలో 225 పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరయించడంతో పోలింగ్‌ చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. మెదక్ రామయంపేట్ మండలంలోని కొనపూర్‌లోనూ ఈవీఎలం మొరయించాయి. సిద్ధిపేట జిల్లా మద్దూరు నుండి చేర్యాల మండలంలో కలపాలని పోలింగ్‌ను అర్జునపట్ల గ్రామస్తులు బహిష్కరించారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఉదయం 9 గంటలకు 10.6 శాతం పోలింగ్‌ నమోదయింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హైదరాబాద్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియెజకవర్గం కరకగూడెం మండలంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ఓటు వేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దంపతులు ఓటు హక్కును విననియోగించుకున్నారు.

నారాయణపేట జిల్లాలో ఉదయం 9 గంటల వరకు నారాయణపేట నియోజవర్గంలో 15 శాతం, మక్తల్ నియోజకవర్గం 9.2 శాతం పోలింగ్ నమోదయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామస్థులు ఎన్నికల పోలింగ్‌ను బహిష్కరించారు. కలెక్టర్ వచ్చి పోడు భూమి పట్టాల సమస్య పరిష్కారానికి హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని స్పష్టం చేశారు. జూలూరుపాడు మండలంలోని సూరారం గ్రామంలో సమస్యలు పరిష్కరించివరకు ఓటింగ్ ప్రక్రియ జరిగేది లేదని భీష్మించుకున్న గ్రామస్థులు. స్థానిక సమస్యలు పరిష్కరించటంలేదని, అంతర్గత రోడ్లు లేని కారణంతో చర్ల మండలంలోని సి. కత్తిగూడెం 76/119 పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడానికి ప్రజలు నిరాకరించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామస్తులతో చర్చలు జరిపారు. రహదారి నిర్మాణం విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో శాంతించిన గ్రామస్తులు అనంతరం ఓటింగ్ లో పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం పోతంగల్‌లో క్యూలైన్‌లో నిలబడి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత, తన భర్తతో కలిసి ఓటు వేశారు. కామారెడ్డి జిల్లా  బాన్సువాడ మండలం తన సొంత గ్రామం పోచారంలో సతీమణి పెరిగే పుష్పామ్మతో పాటు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు వేశారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో బూత్ ఏజెంట్లు లేటుగా రావడంతో ఆలస్యంగా రావడంతో మొదలైంది. దీంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధి జయమ్మ కాలనీలో ఈవీఎంలు పనిచేయకపోవడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం మంచినీళ్లు కూడా లేవని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కేంద్రంలోని లక్ష్మీదేవి పల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జనసేన పార్టీ పార్లమెంట్ ఆభ్యర్ధి నరాల సత్యనారాయణ తన ఓటు వినియోగించుకున్నారు. 


జూనియర్‌ ఎన్టీఆర్‌, కుటుంబీకులు జూబ్లీహిల్స్‌ ఓబుల్‌రెడ్డి స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హీరో అల్లు అర్జున్‌, సినీ నటుడు పోసాని కృష్ణమురళి క్యూలెనులో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేస్తేనే మనకు ప్రశ్నించే అధికారం ఉంటుందని అల్లు అర్జున్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ కరీంనగర్‌లో ఓటు వేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కమ్మరపల్లిలో ఈవీఎం మొరాయించింది.


కాంగ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, తన భార్యతో కలిసి బంజారాహిల్స్‌ పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. మహబూబ్‌నగర్ కలెక్టర్ బంగ్లా సమీపంలోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ రోనాల్డ్ రోస్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. పలు చోట్ల ఈవీఎం మొరాయించడంతో చిన్నచిన్న సమస్యలు తలెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేటలో బూత్ నెంబర్ 1లో ఈవీఎంలు మొరాయించాయి. గంభీరావుపేటలోని బూత్ నెంబర్ 57లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది.

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ ఉదయం 5.30 గంటల నుంచి మాక్‌ పోలింగ్‌ నిర్వహించారు. పోలిం‍గ్‌ సాఫీగా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్‌ను జిల్లా ఎన్నికల అధికారి పి. వెంకట్రామ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు