స్ట్రాంగ్‌ రూంలకు పటిష్ట భద్రత

13 Apr, 2019 12:52 IST|Sakshi
అధికారులు, పార్టీల ప్రతినిధుల సమక్షంలో నర్సాపూర్‌లోని గురుకుల విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంకు సీలు వేస్తున్న దృశ్యం

నర్సాపూర్‌: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. నర్సాపూర్‌లోని స్ట్రాంగ్‌ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్‌లు భద్రపరిచి.. గదులకు సీలు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్‌ అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను నర్సాపూర్‌లోని బీవీరాజు ఇంజినీరింగ్‌ కాలేజీలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్‌ రూంలలో భద్రపర్చినట్లు చెప్పారు. నర్సాపూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ఈవీఎంలను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామన్నారు.

సంగారెడ్డి, పటాన్‌చెరు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను పట్టణంలోని అల్లూరి సీతరామరాజు గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూంలలో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్యారా మిలిటరీ బలగాలతో గట్టి భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో స్ట్రాంగ్‌ రూం వద్ద ఒక సెక్షన్‌ ప్యారామిలిటరీ బలగాలు భద్రతగా ఉంటాయని, ఆయుధాలు కలిగిన ఇద్దరు జవాన్లు నిరంతరం పహారా కాస్తారని కలెక్టర్‌ వెల్లడించారు. స్ట్రాంగ్‌ రూంలు ఏర్పాటు చేసిన భవనాల బయట స్థానిక పోలీసులు ఉంటారన్నారు. ఎన్నికల అబ్జర్వర్‌ సంజయ్‌మీనా పర్యవేక్షణలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూంలకు సీలు వేసినట్లు చెప్పారు. ఆయా పార్టీల అభ్యర్థులు సూచించిన ప్రతినిధులు స్ట్రాంగ్‌ రూంలను చూడాలని భావిస్తే స్ట్రాంగ్‌ రూంలు ఉన్న భవనంలోని ఒక గదిలో సీసీ కెమెరాల మానిటర్‌ ఏర్పాటు చేశామని, మానిటర్‌లో భద్రత చర్యలను చూసుకునే వీలుంటుందన్నారు.

దగ్గరుండి సీలు వేయించిన కలెక్టర్, అబ్జర్వర్‌..
ఈవీఎంలు, వీవీప్యాట్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూంలకు ఎన్నికల అబ్జర్వర్‌ సంజయ్‌మీనా, కలెక్టర్‌ ధర్మారెడ్డి దగ్గరుండి పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేయించారు. సీలు వేసే సమయంలో కలెక్టర్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురుకుల విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూం వద్ద కరెంటు వైర్లను సరి చేయించాలని సూచించారు. ఎస్పీ చందనా దీప్తి స్ట్రాంగ్‌ రూంలను పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద భద్రత, ఇతర అంశాలపై కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి ఎన్నికల అబ్జర్వర్‌ సంజయ్‌మీనాతో చర్చించారు. ఇదిలాఉండగా స్ట్రాంగ్‌ రూంలు ఏర్పాటు చేసిన భవనాల వద్ద ముందస్తు జాగ్రత్తగా ఒక్కో ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచారు.

పార్టీ ప్రతినిధులకు పత్రాలు అందజేత..
మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్‌ స్టేషన్ల వివరాలు, వినియోగించిన ఈవీఎంల వివరాలు, పోలైన ఓట్ల వివరాలతో కూడిన పత్రాలను అధికారులు శుక్రవారం పోటీలో ఉన్న అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. స్ట్రాంగ్‌ రూంలకు సీలు వేసే సమయంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నియమించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్, కాంగ్రెస్‌ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ నియమించిన ఆ పార్టీ ప్రతినిధులు ఆంజనేయులుగౌడ్, మల్లేష్‌  ఉన్నారు.

మరిన్ని వార్తలు