ఔషధాలు, వ్యాక్సిన్ల నిల్వ అస్తవ్యస్తం 

17 Apr, 2019 04:23 IST|Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ అధ్యయనంలో బట్టబయలు 

90 శాతం ఆసుపత్రుల్లో ఔషధ నిల్వలపై సరైన రికార్డులే లేవు 

300 రకాల గడువు తీరిన మందులు ఉన్నాయని నిర్ధారణ 

మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలలో అధ్యయనం చేసిన ఆడిట్‌ బృందం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఔషధాలు, వ్యాక్సిన్ల నిల్వ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ ఆసుపత్రులకు ఏ మేరకు ఔషధాలు, వ్యాక్సిన్లు, ఇతరత్రా పరికరాలు అవసరమన్న దానిపై ఆ శాఖ ఆధ్వర్యంలోని ఆడిట్‌ బృందం రాష్ట్రవ్యాప్తంగా అధ్యయనం చేస్తోంది. ఇప్పటివరకు మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఆడిట్‌ బృందం అధ్యయనం చేసింది. రంగారెడ్డి జిల్లాలో 31 పీహెచ్‌సీలు, 10 బస్తీ దవాఖానాలు, 5 యూపీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలను అధ్యయనం చేసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 28 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, 2 యూపీహెచ్‌సీలను పరిశీలించింది. మొత్తం 81 ఆసుపత్రులను పరిశీలించింది. ఔషధ నిల్వలు, ఇతరత్రా పరికరాల పనితీరు, మెడికల్‌ వ్యర్థాలపై అధ్యయనం చేసింది. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించింది. ఎక్కడెక్కడ మందుల కొరత ఉందో తెలుసుకుంది. అనంతరం ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేసింది. నివేదిక వివరాలను వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన ఒక అధికారి వెల్లడించారు.  

300 ఔషధాలు గడువుతీరినవే.. 
24 ఆసుపత్రుల్లో గడువు తీరినవి 300 ఔషధాలు ఉన్నట్లు గుర్తించింది. స్థానికంగా కొనుగోలు చేసిన ఔషధాల్లో 90 శాతం రికార్డులను కూడా నిర్వహించట్లేదని తేలింది. 54 ఆసుపత్రుల్లో ఈ–ఔషధిని ఆధునీకరించట్లేదని తేల్చింది. 80 శాతం ఆసుపత్రుల రికార్డుల్లో ఉన్న బ్యాచ్‌ నంబర్లకు, అక్కడున్న బ్యాచ్‌ నంబర్లకు పొంతన లేదని పేర్కొంది. యూపీహెచ్‌సీల్లో మాత్రం అవసరానికి మించి ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు గుర్తించారు. ఔషధాలను నిల్వ ఉంచేందుకు వసతులు లేవని తేల్చి చెప్పింది. ఔషధాలను నిల్వ ఉంచేందుకు బీరువాలు  అందు బాటులో లేవు. ఔషధాలు, వ్యాక్సిన్ల నిర్వహణ సరిగాలేదని పేర్కొంది. దారుణమైన విషయం ఏం టంటే ట్రెమడాల్‌ వంటి హెచ్‌ షెడ్యూల్‌ ఔషధాలను కూడా మెడికల్‌ ఆఫీసర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఆరోగ్య ఉపకేంద్రాల్లో రోగులకు ఇస్తున్నట్లు నిర్ధారించారు.  

కాస్త తేడా వచ్చినా అంతే.. 
గడువు తీరిన ఔషధాలు, గడువున్న ఔషధాలను అన్నింటినీ కలిపి ఉంచారని తేల్చారు. దీనివల్ల ఒక్కోసారి గందరగోళంలో గడువు తీరిన వాటిని రోగులకు ఇచ్చే ప్రమాదముంది. కొన్ని ఆసుపత్రుల్లోనైతే గడువు తీరిన ఔషధాలను ఆసుపత్రుల ప్రాంగణాల్లోనే కాల్చేస్తున్నారని తేలింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) సరఫరా చేయకపోవడం వల్ల ఇండెంట్‌ పెట్టినా కొన్ని రకాల ఔషధాలు ఆయా ఆసుపత్రులకు చేరలేదు. ప్రధానంగా టెల్మిమిసర్టాన్‌ మాత్రలు, అల్యూమియనం హైడ్రాక్సైడ్, సిప్రోఫ్లోక్సాసిన్, బైసాకొడైల్‌ మాత్రలు అందజేయలేకపోయారని నివేదిక తెలిపింది. ఇక అమోక్సిసిలిన్, బీ కాంప్లెక్స్, డైక్లోఫినాక్, మెట్రొనిడాజోల్‌ తదితర ఔషధాలను అవసరానికంటే తక్కువగా సరఫరా చేశారని తెలిపింది. 

సిఫార్సులు.. 

  • అన్ని ఆసుపత్రుల్లో ఔషధ నిల్వల వ్యవస్థను బలోపేతం చేయాలి.  
  • రోజువారీగా ఓపీ ఏమేరకు వస్తుందో రికార్డు నిర్వహించాలి.  
  • గడువు తీరిన మందులను వెంటనే ధ్వంసంచేయాలి
  • బయో మెడికల్‌ వ్యర్థాలను శాస్త్రీయంగా పారేయాలి. 
  • నిత్యం రాష్ట్ర, జిల్లాస్థాయి బృందాలు ఆసుపత్రులను పర్యవేక్షించాలి.   
మరిన్ని వార్తలు