‘మీసేవ’లో సమ్మె! 

28 Oct, 2018 03:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నవంబర్‌ 1 నుంచి బంద్‌ నిర్వహిస్తున్నట్లు ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: పౌర సేవల సరళీకరణలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ‘మీ సేవ’లు సమ్మెబాట పట్టాయి. ప్రభుత్వ శాఖల సహకారం అంతంతమాత్రంగా ఉండడం, ఆన్‌లైన్‌ పద్ధతిలో చేయాల్సిన పనులను తిరిగి మాన్యువల్‌ పద్ధతికి మార్చడం వంటి విధానాలను వ్యతిరేకిస్తున్న మీసేవ నిర్వాహకులు ఆందోళనకు దిగుతున్నారు. నవంబర్‌ 1 నుంచి మీసేవ సెంటర్లను బంద్‌ చేసి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ మీసేవ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. ఈమేరకు ఈఎస్‌డీ(ఎలక్ట్రానిక్‌ సర్వీసెస్‌ డెలివరీ) కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు జేఏసీ ప్రతినిధుల బృందం సమ్మె నోటీసిచ్చింది. ఆలోపు సమస్యలు పరిష్కరించాలని, సమస్యలకు సంబంధించిన వినతిని కూడా సమర్పించింది. 

ఆన్‌లైన్‌కు విరుద్ధంగా 
మీసేవ కేంద్రాల్లో పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలోనే సర్వీ సులు అందించాలి. పౌరుల నుంచి దరఖాస్తులను తీసుకుని ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత సంబంధిత అధికారుల యూజర్‌ ఐడీకి దరఖాస్తులను పంపించడం వంటి విధులను మీసేవ కేంద్రాలు నిర్వహిస్తాయి. ఈక్రమంలో పలు కార్యాలయాల్లో కొర్రీలు పెడుతున్నాయని నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపడంతో పాటు వాటిని ప్రింట్‌ తీసి మాన్యువల్‌గా ఇస్తేనే అప్‌డేట్‌ చేస్తామంటూ తహసీల్దార్‌ కార్యాలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో సేవలందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కుల, ఆదాయ ధ్రువీకరణతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తులు ఇతర పథకాలకు సంబంధించిన అన్ని దరఖాస్తులను మాన్యువల్‌గా సంబంధిత కార్యాలయాల్లో అందజేయాల్సి వస్తోంది. ఇందుకు సమయంతో పాటు ప్రింట్‌ అవుట్‌లకు భారీగా ఖర్చవుతోందని మీసేవ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు జీఎస్టీతో ఆదాయం హరించుకుపోతుందని, వీటన్నిటిని పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సమ్మె చేస్తున్నట్లు తెలంగాణ మీసేవ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బైర శంకర్‌ ‘సాక్షి’తో అన్నారు. 

నవంబర్‌ 1నుంచి బంద్‌ 
సమ్మెలో భాగంగా నవంబర్‌ 1నుంచి మీసేవ కేంద్రాలు బంద్‌ కానున్నాయి. సమస్యలు పరిష్కరించేవరకు నిరవధికంగా బంద్‌ పాటిస్తామని తెలంగాణ మీసేవ జేఏసీ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు