కోనసీమను తలపిస్తాం: హరీశ్

15 May, 2015 18:05 IST|Sakshi
కోనసీమను తలపిస్తాం: హరీశ్

మెదక్ (నంగునూరు) :  గోదావరి జలాలను తరలించి సిద్దిపేట ప్రాంతాన్ని కోనసీమను తలపించేలా అభివృద్ధి చేస్తామని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లాలోని నంగునూరు మండలంలో పర్యటించి పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నంగునూరు మండలం పాలమాకులలో భూపంపిణీ కార్యక్రమంలో భాగంగా రాంపూర్, పాలమాకుల గ్రామాల లబ్ధిదారులకు పట్టా పాస్‌పుస్తకాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులకు రాళ్లు, రప్పలు, గుట్టలు, నీళ్లు పడని భూములను పంపిణీ చేశాయని, తమ ప్రభుత్వం సాగుకు యోగ్యమైన భూములను అందజేస్తోందని తెలిపారు.

దళితులకు పంపిణీ చేస్తున్న భూమిలో సంవత్సరం వరకు పంటలు పండించుకునేలా విత్తనాలు, ఎరువులు అందజేయడంతోపాటు డ్రిప్ పరికరాలను ఉచితంగా అందజేస్తామన్నారు. తడ్కపల్లి వద్ద రూ. 6వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి చేయడం ద్వారా సిద్దిపేటతో పాటు హుస్నాబాద్, కొహెడా మండలాల్లోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు రూ.30 కోట్లతో 695 ఎకరాల భూమిని పంపిణీ చేయగా నంగునూరు మండలంలోనే అత్యధికంగా లబ్ధిదారులున్నారని తెలిపారు. దేవాదుల ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నామని, ఎంత కష్టమైనా ప్రాజెక్ట్ పూర్తి చేసి రైతన్నకు సాగు నీరందిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు