రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకరించాలి : ఈటల

8 Aug, 2019 15:22 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకరించాలని‌ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో హర్షవర్ధన్‌తో ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, ఆదిలాబాద్ రిమ్స్లో సుపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో ‌సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు వెల్లడించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని అడిగామన్నారు.

తెలంగాణాలోని తొమ్మిది జిల్లాల్లో ఆస్పత్రుల ఆధునీకరణకు సహకరిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్టు తెలిపారు.రాష్ట్రంలో అదనపు డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు, నేషనల్ హైవేల పక్కన ట్రామా సెంటర్లను ఏర్పాటు చేయాలని అడిగామన్నారు. ఆరోగ్య శ్రీ, కేసీఆర్‌ కిట్ పథకాలకు సహకారం అందించాలని కోరామని వెల్లడించారు. హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు ప్రారంభించామని.. గ్రామాల్లో  వైద్య శిబిరాలను వెల్‌నెస్‌ సెంటర్లగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని కోరినట్టు తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణంతో పాటు సైన్స్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద తెలంగాణలో 80 వేల కుటుంబాలను గుర్తించామని తెలిపారు. పిలిప్పీన్స్, రష్యా, చైనాలో ఎక్కడ వైద్య విద్య చదివినా మన దేశంలో మళ్ళీ వైద్య పరీక్ష తప్పనిసరి అని గుర్తుచేశారు. 

ఎన్‌ఎంసీ  బిల్లుతో మేలు..
నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లు(ఎన్ఎంసీ)తో మేలు జరుగుతుందే తప్ప..నష్టం జరగదని కేంద్ర మంత్రి చెప్పినట్టు ఈటల వెల్లడించారు. ఈ బిల్లు గురించి అర్థమయితే విద్యార్థులు సంతోష పడతారని కేంద్రమంత్రి వివరించినట్లు తెలిపారు. అంతేకాకుండా కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ను కలువనున్నట్టు తెలిపారు. నీలగిరి కొండల్లో రాష్ట్ర్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే వైద్యశాలలకు సహకరించాలని ఆయన్ని కోరతామని అన్నారు.

మరిన్ని వార్తలు