బాబును ఏపీ ప్రజలు తరిమికొడతారు

18 Jan, 2019 01:08 IST|Sakshi

మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. చంద్రబాబు మాకొద్దు అనే నినాదంతో మూడు నెలల్లో ప్రజలు బాబును తరిమికొడతారని చెప్పారు. పూటకో మాట మాట్లాడే చంద్రబాబును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని అన్నారు. గురువారం ఆయన ఇక్కడ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ‘సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి వచ్చా. నేను మీలా దేవాలయాల దగ్గర రాజకీయం చేయను. మాకు బంధాలు, బంధుత్వాల గురించి తెలుసు. బంధాలు, బంధుత్వాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. మీలా మేము శవరాజకీయాలు చేయం. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క యాదవ సంఘానికే కాదు వెనుకబడిన వాళ్లకి కూడా మద్దతు ఇస్తాం. చంద్రబాబులా మా సీఎం దొంగ రాజకీయాలు చేయరు. ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదంటోన్న బాబుకు.. అదేంటో త్వరలోనే తెలుస్తుంది. చంద్రబాబులా మోసపూరిత జీవితం మాది కాదు. చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తారు. చిల్లర రాజకీయాలు చేస్తే.. మా సమాధానాలు చాలా దీటుగా ఉంటాయి. మీరు తెలంగాణలో రాజకీయాలు చేస్తే సంసారం.

మేము ఏపీలో రాజకీయాలు చేస్తే వ్యభిచారమా? 15 రోజుల్లో మా సీఎం కేసీఆర్‌ ఏపీకి వస్తారు. దమ్ముంటే అప్పుడు నీ ప్రతాపం చూపించు. చంద్రబాబు ఏపీ ప్రజల సొమ్మును ప్రకటనల పేరుతో వృథా చేస్తున్నారు. కులాల మధ్య గొడవలు పెడుతున్నారు. మీరు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణలో కరెంట్, నీళ్లు కూడా లేవు. మా సీఎం కేసీఆర్‌ వచ్చాకే అన్నీ ఒక్కొక్కటిగా తీర్చాము. మీ అందమైన మొహాన్ని చూస్తేనే అందరికీ మీరంటే ఏంటో తెలుస్తుంది. నీతి, జాతి లేని మాటలు మీవి. ఆంధ్రప్రదేశ్‌ దద్దమ్మ మంత్రులు ఫెడరల్‌ ఫ్రంట్‌పై అనవసర, అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు. ఏపీ ప్రజల హక్కుల కోసం మా ప్రభుత్వం వంద శాతం సహకరిస్తుంది. చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం. టీఆర్‌ఎస్‌ ఎప్పటికీ బీజేపీ, కాంగ్రెసేతరే పార్టీనే. నేను ఏపీకి వెళ్తేనే అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక మా సీఎం కేసీఆర్‌ వెళ్తే ఎలా ఉంటుందో మీరే ఆలోచించుకోండి’అని అన్నారు. తనను కలిసిన తన బంధువులు (టీడీపీ నేతలపై) చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు చేసిన హెచ్చరికను ఓ విలేకరి ప్రస్తావించగా ‘వారిపై చర్యలు తీసుకోవడమేమిటి? సమయం వచ్చినప్పుడే వారే నిన్ను బహిష్కరిస్తారు’అని తలసాని మండిపడ్డారు. 

మరిన్ని వార్తలు