గవర్నర్‌కు ఎమ్మెల్యేల జాబితా

13 Dec, 2018 10:41 IST|Sakshi
బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు కొత్త ఎమ్మెల్యేల జాబితాను అందజేస్తున్న సీఈవో రజత్‌కుమార్, కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి ఎస్‌కే రుడోలా

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో విజయం సాధించిన అభ్యర్థుల జాబితాను బుధవారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌కు సమర్పించారు. అనంతరం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ముగిస్తున్నామని, రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు సైతం ముగిసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు 30 రోజుల్లోగా ఎన్నికల వ్యయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నారు. 

లక్షల ఓట్ల గల్లంతు అవాస్తవం..
ఓటర్ల జాబితాలో 24 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం లో అవాస్తవమని సీఈఓ అన్నారు. అంత మొత్తంలో ఓట్లు గల్లంతు జరిగితే ఓట్లు కోల్పోయిన వ్యక్తులు, రాజకీయ పార్టీలు ఒప్పుకునేవారు కాదని, ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య తలత్తేదన్నారు. ప్రతిసారి ఎన్నికల్లో కొన్ని ఓట్లు గల్లంతు కావడం సహజమేనన్నారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు చనిపోయిన, చిరునామా మారిన ఓటర్ల తొలగింపు కోసం ప్రతి ఏటా ఓటర్ల జాబితా సవరణ నిర్వహిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఏటా ప్రతి ఒక్కరూ తమ పేరు జాబితాలో ఉందో లేదో చూసుకోవాలన్నారు. 2015 లో ప్రచురించిన ఓటర్ల జాబితాలో 2.81 కోట్ల ఓటర్లు ఉండగా, ఆ తర్వాత నిర్వహించిన జాతీయ ఓటర్ల జాబితా ప్యూరిఫికేషన్‌ కార్యక్రమంలో భాగంగా చనిపోయిన, చిరునామా మారిన 24 లక్షల ఓట్లను తొలగించామన్నారు.

2018లో మూడుసార్లు ఓటర్ల జాబితా సవరణ నిర్వహించగా, 20 లక్షలకు పైగా కొత్త ఓటర్లను నమోదు చేశామన్నారు. ఓటర్ల తొలగింపునకు ముందు 7 రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కోరుతూ ప్రతి ఓటరుకు స్థానిక బీఎల్‌ఓలు నోటీసులు జారీ చేశారన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2019లో భాగంగా ఓటర్ల నమోదు కోసం డిసెంబర్‌ 24 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, 2018, డిసెంబర్‌ 31 నాటి కి 18 ఏళ్లు నిండే వ్యక్తులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తులూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

మానవ తప్పిదాలతోనే ఈవీఎం సమస్యలు
ఈవీఎంల ట్యాంపరింగ్‌ వల్లే ఓటమిపాలయ్యామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ చేసిన ఆరోపణలను సీఈవో తోసిపుచ్చారు. ఈవీఎంలను ట్యాంపర్‌ చేసేందుకు ఆస్కారం లేదన్నారు. పటిష్ట పోలీసు బందోబస్తు, సీసీటీవీ కెమెరాల నిఘా మధ్య ఈవీంలను భద్రపరిచామన్నారు. 100 శాతం వీవీప్యాట్‌ ఓట్లను లెక్కిం చాలన్న కాంగ్రెస్‌ విజ్ఞప్తి ఆచరణలో సాధ్యం కాదన్నా రు. మానవ తప్పిదాలతో కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలతో రెండు రకాల సమస్యలు తలెత్తాయన్నారు. రాష్ట్రంలోని 92 పోలింగ్‌ కేంద్రాల్లో మాక్‌ పోలింగ్‌లో వేసిన ఓట్లను తొలగించకుండానే పోలిం గ్‌ను ప్రారంభించడంతో మాక్‌ పోలింగ్, అసలు పోలింగ్‌ ఓట్లు కలిసిపోయాయన్నారు.

మాక్‌ పోలింగ్‌ తర్వాత సీఆర్‌సీ (క్లియర్‌ రిపోర్ట్‌ క్లోజ్‌) మీటను ప్రిసైడింగ్‌ అధికారులు నొక్కడం మరిచిపోవడంతో ఈ సమస్య తలెత్తిందన్నారు. వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించడం ద్వారా ఈ పోలింగ్‌ కేంద్రాల ఓట్లను పరి గణనలోకి తీసుకున్నామన్నారు. పోలింగ్‌ ముగిసిన తర్వాత ‘పోల్‌ ఎండ్‌’ మీట నొక్కకపోవడంతో రెండు పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలను కౌంటింగ్‌ రోజు తెరుచుకోలేదన్నారు. స్థానిక అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ‘పోల్‌ ఎండ్‌’ మీటను నొక్కిన తర్వాత ఈ ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిం చామని, ఆ తర్వాత ఆ ఓట్ల సంఖ్యను వీవీ ప్యాట్‌ ఓట్ల సంఖ్యతో సరి చూసుకున్నామన్నారు. ఈ రెండు సందర్భాలోనూ వాస్తవంగా పోలైన ఓట్లతో వీవీ ప్యాట్‌ ఓట్ల సంఖ్యతో సరిపోయాయన్నారు. 

ఫలితాలపై గెజిట్‌ నోటిఫికేషన్‌ 
రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 88 టీఆర్‌ఎస్, 19 కాం గ్రెస్, 7 ఎంఐఎం, 2 టీడీపీ, చెరొక బీజేపీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యులతో పాటు ఓ స్వతంత్ర అభ్యర్థి పేర్లతో జాబితాను ఇందులో పొందుపరిచింది. 

మరిన్ని వార్తలు