‘పెద్దల’పై అనాసక్తి..

12 Nov, 2018 09:47 IST|Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: పెద్దల సభ ఎలక్షన్‌ నేపథ్యంలో ఓటు ఆవశక్యతపై అధికారులు అవగాహన కల్పించకపోవడంతో నమోదుకు పట్టభధ్రులు, ఉపాధ్యాయులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈసారి ఎమ్మెల్సీ ఓటు నమోదులో జిల్లా వెనకబడింది. ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్‌ జిల్లాలో ఓటు నమోదు బాగానే జరిగినా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో ముందుకు రావడం లేదు. ఓటు నమోదు తక్కువగా జరగడంతో ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది.

గడువు ఈనెల 19 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లా పాత ఓటర్ల సంఖ్య 34,557గా ఉంది. దీనికి అనుగుణంగా దరఖాస్తులు రాకపోయినా.. కనీసం అందులో సగం మంది ఓటర్లు కూడా ఈసారి నమోదు చేసుకోకపోవడం గమనార్హం. మండలి ఓటు   నమోదుపై ప్రచారం లేకనే పట్టభద్రులు, ఉపాధ్యాయుల నుంచి స్పందన రావడం లేదని గ్రహించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వతహాగా ప్రచారం చేపట్టినా ఆశించిన మేర నమోదు కాలేదు. కాగా ఆయా శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఎక్కువ శాతం పట్టభద్రులే              ఉన్నారు. ఇందులో కొంత మంది ఇప్పటి వరకు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోలేకపోవడం గమనించదగ్గ విషయం. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల హడావిడిలో జిల్లా యంత్రాంగం ఉండడం, మండలి ఓటరు నమోదుపై ప్రచారం లేకపోవడం.. వెరసి ఈసారి ఎమ్మెల్సీ ఓటర్లు తక్కువగా నమోదయ్యారు.

పాత జిల్లాలో 34,557 ఓట్లు..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 34,557 మంది ఉన్నారు. ఇందులో 30,488 మంది పట్టభద్రులు ఉండగా, 4,069 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. ఈఏడాది అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 6 వరకు జరిగిన ప్రక్రియ ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 10,150 మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఓటు నమోదు చేసుకున్నారు. అయితే ఒక్కో రెవెన్యూ డివిజన్‌ పరిధిలో దాదాపు 1,550 నుంచి 1,950 మంది వరకు ఓటరుగా నమోదు చేసుకున్నట్లు సమాచారం. కాగా 2013లో చేపట్టిన ఎమ్మెల్సీ ఓటరు నమోదులో కన్పించిన జోరు.. ఈసారి కనిపించడం లేదు. నమోదుపై క్షేత్రస్థాయిలో ప్రచారం లేకపోవడంతో   అధిక సంఖ్యలో ఉన్న పట్టభద్రులు ముందుకు రాలేకపోయారు. ఈ నెల 6 వరకు జరిగిన ఓటు నమోదు సమయంలో ఆన్‌లైన్‌ మొరాయించిన విషయం తెలిసిందే. దాన్ని సాకుగా చూపుతూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. కనీసం ఎంత మంది పట్టభద్రులు, ఎంత మంది ఉపాధ్యాయులు నమోదు చేసుకున్నారో కూడా తెలియదని సమాధానం ఇవ్వడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

అభ్యర్థులే ప్రచార సారథులు..
2019 మార్చి చివరి నాటికి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలవాలని భావిస్తున్న వారే శాసన మండలి నియోజకవర్గ ఓటరు నమోదుపై ప్రచారం చేయాల్సి వస్తోంది. ఓటరు నమోదు సమయంలో గత నెలాఖరులో నిర్మల్‌ జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి పనిలో పనిగా ఆదిలాబాద్‌కు సైతం వచ్చి వెళ్లారు. వీలైనంత ఎక్కువ మందికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో అధికారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అప్రమత్తం కావాల్సి ఉందని ఎన్నికల సంఘం సూచించినట్లు సమాచారం. దీని దృష్ట్యా ఇప్పటికైనా అధికారులు స్పందించి అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా తీరుగానే ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై ప్రచారం నిర్వహిస్తే తప్పా పట్టభద్రులు ఓటు కోసం పోటెత్తే అవకాశం కన్పించడం లేదు.

ఎమ్మెల్సీ ఓటు నమోదు ఇలా..  
ఎమ్మెల్సీ ఓటరుగా ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవాలనుకునే వారు   ఠీఠీఠీ. ఛ్ఛిౌ ్ట్ఛ ్చnజ్చn్చ. nజీఛి. జీn లోకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. లేదా నేరుగా ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి ఇవ్వడానికి అవకాశం ఉంది. 2015 నవంబర్‌ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల నియోజకవర్గానికి ఓటు హక్కు పొందడానికి అర్హులు. 2012 నవంబర్‌ 1 నుంచి ఈఏడాది నవంబర్‌ 1 వరకు ఆరేళ్లలో మూడేళ్లకు తగ్గకుండా గుర్తింపు పొందిన ప్రైవేట్‌ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో బోధన అనుభవం ఉన్న వారు ఉపాధ్యాయ నియోజకవర్గంలో ఓటు హక్కు పొందడానికి అర్హులు.

19 వరకు గడువు పొడిగింపు.. 
ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఈ నెల 6తో ముగిసిన నమోదు ప్రక్రియను ఈనెల 19 వరకు పొడగించింది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి గతంలో ఓటేసినా ఇప్పుడు మళ్లీ తప్పక దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టభద్రులు ఫారం– 18, ఉపాధ్యాయులు ఫారం– 19ను పూర్తి చేసి అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ ఓటు హక్కు పొందే వారు పట్టభద్రుల ఓటు పొందడానికి అర్హులవుతారు. అయితే వారు ఫారం– 18, 19ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాగా జిల్లా అధికారులకు గడువు పొడిగింపు సమాచారం అధికారికంగా అందాల్సి ఉంది.

మరిన్ని వార్తలు