పోరు మాగాణం

17 Sep, 2014 01:45 IST|Sakshi
పోరు మాగాణం

ఓరుగల్లు ఓ ఆయుధం.. ఓ తూటా.. ఓ సైనికుడు.. పోరాటాలకు దిశానిర్దేశం చేసిన గడ్డ. నైజాం నవాబును, ఆయన తొత్తులు.. రజాకార్లు, దేశ్‌ముఖ్‌లను తరిమికొట్టిన చోటు. చాకలి ఐలమ్మ శౌర్యం, దొడ్డి కొమురయ్య ధీరత్వం, బందగీ అమరత్వం పుణికిపుచ్చుకున్న భూమి. దొరల పెత్తందారీ, భూస్వామ్య వ్యవస్థపై సమరశంఖం పూరించిన మాగాణం. భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలు చేసిన సాయుధ గెరిల్లా పోరాటం ఎందరికో స్ఫూర్తినిచ్చింది.
 
ఇంకెందరికో ఉత్తేజాన్నిచ్చింది. సుమారు 900 మంది వీరుల రక్తంతో తడిసిన ఈ గడ్డమీది నుంచే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మెుదలైంది. తొలిసారిగా 1969లో ఉద్యమ బీజాలు పడ్డారుు. ఆ తర్వాత 2001 నుంచి ఉద్యమం మహా కెరటమై ఎగిసింది. పల్లె, పట్నం కదం తొక్కాయి. 143 మంది విద్యార్థులు, యువకులు ఆత్మార్పణ చేసుకున్నారు. నాడు నిజాం పాలన నుంచి విముక్తి పొందితే.. నేడు ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరింది. సాయుధ పోరులో.. స్వరాష్ట్ర ఉద్యమంలో జిల్లా ప్రజలు చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయం.
 
రజాకార్ల దురాగతాలపై అక్షర సమరం
కేసముద్రం : రజాకార్ల ఆగడాలను ఎదిరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఒద్దిరాజు సీతారామచందర్‌రావు, రాఘవరంగారావు ‘తెనుగు పత్రిక’ను స్థాపించారు. ఈ తెలుగు పత్రిక తొలి సంచికను 1922 ఆగస్టు 22న అప్పటి నిజాం ప్రభుత్వం హయంలో కుగ్రామంగా ఉన్న కేసము ద్రం మండలం ఇనుగుర్తిలోనే ముద్రించారు. అప్పటి వరకు తెలుగు పత్రికలు లేవు. ఇదే తొలి పత్రిక. ఒద్దిరాజు సోదరు లు పత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. వీరిద్దరూ కవిత్వంలో దిట్టకావడంతో జంటకవులుగా ప్రసిద్ధికెక్కారు.
 
నిజాంకు వణుకు పుట్టించిన పత్రిక
నిజాం పాలనలో అన్ని రకాలుగా అణిచివేతకు గురైన తెలంగాణ ప్రజలందరినీ మేల్కొలిపి వారిని చైతన్యవంతులుగా చేయడానికి ఒద్దిరాజు సోదరులు తమ కలానికి పదునుపెట్టారు. వారు రాసిన అనేక శీర్షికలు నిజాం, రజాకారుల గుండెల్లో గుబులు పుట్టించడమేకాక, అణచివేతకు గురైన ప్రజలను ఉత్తేజపరిచాయి. పత్రికకు చందాదారులు లేకపోవడంతో సోదరులిద్దరూ స్వయంగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, విజయవాడ, బందరు, చైన్నై, మానుకోట తదితర ప్రాంతాలలో చందాదారులను చేర్పించారు. పత్రికలో వచ్చిన కథనాలకు మంచి స్పందనరావడంతో హైదరాబాద్‌కు చెందిన బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి హన్మంతరావు, కొదాటి రామకృష్ణారావు, వెంకటేశ్వర్‌రావు లాంటి ప్రముఖులు తెనుగు పత్రికలో వార్తలు, వ్యాసాలు రాయడానికి ముందుకొచ్చారు. వారి స్ఫూర్తితో ఒద్దిరాజు సోదరుల సమీప బంధువు నల్గొండకు చెందిన షబ్నాలీస్ వెంకటనర్సింహారావు ‘నీలగిరి’ పత్రికను 1923లో స్థాపించారు.
 
ఇనుగుర్తిలో రజాకార్ల దాడులు
తెనుగు పత్రికలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా వస్తున్న వార్తలకు మండిపడ్డ రజాకార్లు ఇనుగుర్తి గ్రామానికి చేరుకుని దాడులకు దిగారు. ఒద్దిరాజు సోదరులకు చెందిన గ్రంథాలను, ముద్రణ మిషన్‌లను ధ్వంసం చేసి తగుల బెట్టారు. ఈ క్రమంలో స్నేహితుల సహకారంతో పత్రిక నిర్వహణను జిల్లా కేంద్రానికి మార్చారు. తర్వాత కొద్ది నెలలకు పలు కారణాల వల్ల పత్రిక ప్రచురణ నలిచిపోయిం ది. మొత్తం మీద తెనుగు పత్రిక ఆరు సంవత్సరాల పాటు విజయవంతంగా ప్రచురితమైంది.
 
గోలకొండ పత్రిక
తెనుగు పత్రిక తర్వాత పుట్టిన గోలకొండ పత్రిక కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ దక్కన్ కేంద్రంగా ప్రతీ సోమ, గురువారాల్లో వెలువడిన ఈ పత్రికలో జవహర్‌లాల్ నెహ్రూ వ్యాసాలతో పాటు ఆ సమయంలో జరుగుతున్న పోరాటాల తీరు, వార్తా కథనాలను ప్రచురించారు.

మరిన్ని వార్తలు