ఎంపీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

7 Jun, 2019 13:04 IST|Sakshi
సమాశేశం‍లో మాట్లాడుతున్న కలెక్టరు

మెదక్‌ రూరల్‌: మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి పేర్కొన్నారు.  ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రిసైడింగ్‌ అధికారులు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పరోక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. సమావేశ మందిరంలో ఎంపీటీసీలుగా ఎంపికైన వారు ఒకవైపు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునేందుకు మరోవైపు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల రోజున ముందుగా కోఆప్షన్‌ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించడం జరుగుతుం దన్నారు.

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు తర్వాత అభ్యర్థి ఎన్నికను అధికారికంగా ప్రకటించాలన్నారు. కోఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక జరిగేందుకు సరైన కోరం లేనట్లయితే సరిపడా సభ్యులు వచ్చేంత వరకు అధికారులు వేచి చూడాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా పారదర్శకంగా పరోక్ష ఎన్నికలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి, డీపీఓ హనోక్‌తో పాటు ప్రిసైడింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు