గులాబీ మండలాధీశులు

7 Jun, 2019 08:05 IST|Sakshi
రామడుగులో ఎంపీపీ ఎన్నిక ఏర్పాట్లు పరిశీలిస్తున్న జేసీ శ్యాంప్రసాద్‌లాల్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అప్రతిహత విజయంతో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో గులాబీ జెండాలను ఎగరేసిన టీఆర్‌ఎస్‌ కీలకమైన మండల ప్రజాపరిషత్‌ పీఠాలను తన వశం చేసుకోబోతుంది. ఉమ్మడి జిల్లాలోని 58 మండలాల్లో కేవలం మూడు చోట్ల మినహా 55 చోట్ల టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎంపీటీసీలే మండలాధీశులుగా బాధ్యతలు చేబట్టబోతున్నారు. ఇప్పటికే క్యాంపుల్లో ఉన్న ఆయా మండలాల నుంచి గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీలు, వారికి మద్దతు ఇస్తున్న ఇతర పార్టీల విజేతలు శుక్రవారం నేరుగా మండల కార్యాలయాలకు చేరుకుని బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కొత్త మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గెలిచిన ఎంపీటీసీలు చేజారిపోకుండా ఎమ్మెల్యేల సహకారంతో చైర్మన్‌ అభ్యర్థులు క్యాంపుల కోసం ఇప్పటికే హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు.
 
చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ
టీఆర్‌ఎస్‌ కన్నా ఒకటి రెండు చోట్ల ఎక్కువ సంఖ్యలో సీట్లు గెలిచిన మండలాలను సైతం కాంగ్రెస్‌ తన ఖాతాలో వేసుకోలేక చేతులెత్తేసింది. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి, రామడుగు మండలాల్లో టీఆర్‌ఎస్‌ కన్నా ఎక్కువ మెజారిటీ ఉన్నప్పటికీ క్యాంపు రాజకీయాలు నడిపే సాహసం చేయలేక చేతులెత్తేసింది. ఈ లోపు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, నేతలు వైరిపక్షంలోని సభ్యులను తమ క్యాంపుల్లోకి తీసుకెళ్లారు. చొప్పదండిలో నాలుగు ఎంపీటీసీలు గెలుచుకున్న బీజేపీ సైతం తమకు మద్దతు పలికిన ఇండిపెండెంట్లు, కాంగ్రెస్‌ సభ్యులను కాపాడుకోలేక పోయింది. బీజేపీ నాయకులు కాళేశ్వరంలో క్యాంపు నడిపినా టీఆర్‌ఎస్‌ వాళ్లు క్యాంపు నుంచే తమకు అవసరమైన సభ్యులను తీసుకెళ్లారు. ఇక్కడ రెండు సీట్లు మాత్రమే గెలిచిన టీఆర్‌ఎస్‌ ఎంపీపీ పదవిని దక్కించుకోబోతుంది. దీంతో కరీంనగర్‌ జిల్లాలో 15 ఎంపీపీలకు మొత్తంగా టీఆర్‌ఎస్‌ వశమైనట్టే.

పెద్దపల్లిలో చక్రం తిప్పిన ‘దాసరి’
పెద్దపల్లి జిల్లాలో సైతం టీఆర్‌ఎస్‌ రాజకీయం ముందు కాంగ్రెస్, బీజేపీ నిలబడలేకపోయాయి. పెద్దపల్లి, జూలపల్లి, రామగిరిలో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రాజకీయంతో ఈ మూడు మండలాలు కూడా టీఆర్‌ఎస్‌కే అనుకూలమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే పెద్దపల్లి, జూలపల్లి మండలాల్లో ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిని తమ వైపు తిప్పుకున్న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి రామగిరి మండలంలో కూడా సగం సగంగా ఉన్న కాంగ్రెస్‌ బలాన్ని తగ్గించేందుకు వ్యూహాన్ని అమలు చేసినట్లు సమాచారం. ఇక్కడ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఆరేసి సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ నుంచి ఒకరిద్దరిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.

కాంగ్రెస్‌ ఖాతాలోకి వేములవాడ రూరల్, బీర్పూరు, జగిత్యాల అర్బన్‌..
జగిత్యాల జిల్లాలో రెండు సీట్లు కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లనున్నాయి. జిల్లాలో 18 మండలాలకుగాను 16 చోట్ల టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండగా, బీర్పూరులో కాంగ్రెస్‌ జెడ్పీటీసీ స్థానంతోపాటు మెజారిటీ మండలాలను గెలుచుకుంది. జగిత్యాల అర్బన్‌లో సైతం కాంగ్రెస్‌కే మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఈ రెండు చోట్ల ఖాతా తెరవనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రూరల్‌ సైతం కాంగ్రెస్‌ ఖాతాలోనే పడనుంది. ఇక్కడ పార్టీ నేత ఆది శ్రీనివాస్‌ పావులు కదిపి గెలిచిన కాంగ్రెస్‌ సభ్యులతోపాటు మద్ధతుదారులను క్యాంపుకు పంపించారు. దీంతో వేములవాడ రూరల్‌ కాంగ్రెస్‌ వశం కావడం ఖాయమైనట్లే.   

మరిన్ని వార్తలు