-

మున్సి‘పోల్స్‌’కు కసరత్తు

20 Jun, 2019 08:54 IST|Sakshi
కార్పొరేషన్‌ కార్యాలయం

కరీంనగర్‌కార్పొరేషన్‌: మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జూలై 2తో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో ఆ లోపే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే నిర్ణయానికొచ్చింది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్‌ వెల్లడించడం తెలిసిందే. దీంతో అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. జిల్లాలో కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల సందడి ఏర్పడింది. అన్ని మున్సిపాలిటీల్లో పుర ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు.

ఓటరు జాబితాతోపాటు బీసీ రిజర్వేషన్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులకు పురపాలక శాఖ నుంచి ఆదేశాలు అందాయి. ఈ నెల 21 నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల రిజర్వేషన్లను పోలింగ్‌ కేంద్రాల వారీగా పూర్తిచేయాలని సీడీఎంఏ(చైర్మన్‌ అండ్‌ డైరెక్టర్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌) టీకే శ్రీదేవి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసి ఏ ఇంటి నెంబర్‌ ఏ డివిజన్‌లో వస్తుందో ఆ ఇంటి నెంబర్‌ను టీపోల్‌ సాప్ట్‌వేర్‌లో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఓటర్ల జాబితా ముసాయిదా ప్రదర్శన, జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ, అభ్యంతరాలను పరిష్కరించడం, అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు సీడీఎంఏ కార్యాలయంలో గురువారం అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, ఇతర అధికారులు ఎన్నికలపై సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు.

డివిజన్ల పునర్విభజనపై సందిగ్ధం
కరీంనగర్‌ నగరపాలక సంస్థలో సమీపంలోని పద్మనగర్, సీతారాంపూర్, రేకుర్తి, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, సదాశివపల్లి, అల్గునూరు గ్రామాలు విలీనం జరిగాయి. ఈ గ్రామాలను ఏ విధంగా డివిజన్లుగా మారుస్తారనేది సందిగ్ధంగా మారింది. డివిజన్ల పెంపు జరుగుతుందని గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఉన్న డివిజన్లలోనే విలీన గ్రామాలను కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయా గ్రామాలకు ఆనుకొని ఉన్న డివిజన్లలో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలా జరిగితే శివారు డివిజన్ల ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరిగి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలా కాకుండా విలీన గ్రామాల ఓటర్లను కలుపుకొని పునర్విభజన చేస్తే డివిజన్ల స్వరూపం మారనుంది. పునర్విభజన జరగకపోతే శివారు డివిజన్ల రాజకీయ నేతలకు ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పునర్విభజన జరిగితే మొత్తం నగర డివిజన్లపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునర్విభజన జరపాలంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. జూలైలోనే ఎన్నికలు జరపాల్సి వస్తే ఎలాంటి మార్పులు లేకుండా విలీన గ్రామాలకు ఆనుకొని ఉన్న డివిజన్లలోనే కలిపి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

అయోమయంగా రిజర్వేషన్ల ప్రక్రియ...
నగరపాలక సంస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి, డివిజన్ల రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. విలీన గ్రామాలకు సంబం«ధించిన ఓటర్ల జాబితా, నగర ఓటర్ల జాబితా పూర్తిచేయాల్సి ఉంది. మున్సిపాలిటీలకు కొత్త చట్టం తెస్తే రిజర్వేషన్లు పూర్తిగా మారుతాయని తెలుస్తోంది. పాత పద్ధతినే ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారమే యధాతథంగా రిజర్వేషన్లు ఉండనున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కొత్త మున్సిపల్‌ చట్టం ప్రకారం జరుపుతారా... లేదా పాత పద్ధతినే చేపడతారా అనేది అయోమయంగా మారింది.
 
తెరపైకి కొత్త పురపాలక చట్టం..?
తెలంగాణ ప్రభుత్వం పురపాలికల్లో సమూల మార్పులు చేసేందుకు కొత్త పురపాలక చట్టాలన్ని అమలులోకి తేనుంది. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త పురపాలక చట్టానికి ఆమోదముద్ర పడే అవకాశాలున్నాయి. లేని పక్షంలో ఆర్డినెన్స్‌ ద్వారా చట్టాన్ని తెస్తామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. కొత్త చట్టంలో పుర ఎన్నికల్లో మేయర్, చైర్మన్‌ ఎన్నికలు ప్రత్యక్షంగా జరుగుతాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలా జరిగితే కార్పొరేటర్ల బేరసారాలు, అధికా రాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడం వంటివి ఘటనలకు చెక్‌పడనుంది. ఒక్క డిప్యూటీ మేయర్‌ ఎన్నికకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. కొత్త చట్టంలో ఎన్నికల కంటే పౌరసేవలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు సమాచారం.

ఆశావహుల సందడి...
మున్సిపాలిటీల ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆశావహుల్లో సందడి నెలకొం ది. ఇప్పటికే వివిధ డివిజన్ల నుంచి కార్పొరేషన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతోపాటు వివిధ పార్టీల నుంచి పోటీకి దిగేందుకు సమాయత్తం అవుతున్న నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అన్ని పార్టీలు మరోమారు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఆయా డివిజన్లలో ఇప్పటికే ఇల్లిల్లు తిరుగుతూ తమ అనుచరులను కలుస్తూ ఎన్నికలు వస్తున్నాయని, తమకు మద్దతు తెలుపాలని కోరు తూ అంతర్గత ప్రచారం మొదలుపెట్టారు. ఈసారి ఎన్నికల సమీకరణాలు పూర్తిగా మారుతాయని, గ్రామీణ ప్రాంత స్థానిక ఎన్నికలకు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పుర ఎన్నికల ప్రకటనతో నగరంలో రాజకీయ సందడి నెలకొంది.

మున్సిపాలిటీల్లో సందడి...
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం, వెంటవెంటనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా ఓటర్ల గణన చేపట్టడంతో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సందడి మొదలైంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, కొత్తగా ఏర్పడ్డ కొత్తపల్లి, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల హడావుడి కనిపించింది. గురువారం సీడీఎంఏ కార్యాలయంలో జరిగే ఎన్నికల సమీక్ష సమావేశానికి మున్సిపాలిటీల్లో అధికారులు సమాచారాన్ని సిద్ధం చేయడం కనిపించింది. ఆశావహులు మున్సిపాలిటీలకు చేరుకొని ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. త్వరలో జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియ ఎలా ఉండబోతుందనే అంశంపై పలు వురు చర్చించుకున్నారు. మేయర్, చైర్మన్‌ రిజర్వేషన్, కార్పొరేటర్‌లు, కౌన్సిలర్ల రిజర్వేషన్లు ఏ డివి జన్, ఏ వార్డుకు ఎలా ఉంటాయనే నేతలు అంచనాలు వేస్తున్నారు. మొత్తం మీద మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది.

మరిన్ని వార్తలు