చంద్రబాబు జులుంపై ‘నాయీ’ల ఆగ్రహం

18 Jun, 2018 21:13 IST|Sakshi
ఎం. లింగం నాయీ

సాక్షి, హైదరాబాద్‌: తమ కులస్తులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులుం పదర్శించడాన్ని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక తీవ్రంగా ఖండించింది. ఏపీ నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధుల పట్ల చంద్రబాబు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది.

మొదటి నుంచి తమ పట్ల చంద్రబాబు వివక్ష చూపుతున్నారని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక అధ్యక్షుడు ఎం. లింగం ఆరోపించారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఉమ్మడి రాష్ట్రంలో ఉండగానే చంద్రబాబును కోరినా పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఉద్యోగాలు ఎక్కడున్నాయ్‌ అంటూ వ్యంగ్యంగా మాట్లాడారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇదే మాట చెబుతూ వస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఏపీలో నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెల్పుతున్నామని ప్రకటించారు. తమ వారికి సంఘీబావంగా అవసరమైతే తెలంగాణలోనూ కళ్యాణ కట్టలను బంద్‌ చేస్తామని హెచ్చరించారు. తెలంగాణలోనూ ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


 

మరిన్ని వార్తలు