‘క్షురకుడిపై కేసు ఎత్తివేయాలి’

26 Mar, 2020 11:38 IST|Sakshi
మద్దికుంట లింగం నాయీ

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు తామంతా సంపూర్ణంగా సహకరిస్తామని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్‌ మద్దికుంట లింగం నాయీ ప్రకటించారు. గురువారం కార్యవర్గ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు సహకరించాలని, క్షౌరశాలలను తెరవొద్దని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాయీ బ్రాహ్మణులకు ఆయన పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం, స్వయం నియంత్రణ పాటించాలని సూచించారు. క్షురకర్మ అనేది మనుషులకు దగ్గరగా ఉండే చేసే వృత్తి కాబట్టి కరోనా వైరస్‌ సులభంగా వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. దగ్గు, తుమ్ము, స్పర్శ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని తెలిపారు. కరోనా నివారణకు ప్రభుత్వ సూచనల ప్రకారం నడుచుకోవాలని కోరారు. లాక్‌డౌన్‌ కారణంగా నష్టపోయిన నిరుపేద నాయీ బ్రాహ్మణులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. సెలూన్ల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయడంతో పాటు తగినవిధంగా ఆర్థిక​ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రకటించిన వ్యక్తిగత రుణాలు, సొసైటీ రుణాలు వెంటనే మంజూరు చేస్తే నాయీ బ్రాహ్మణులను ఆదుకున్నట్టు అవుతుందని ప్రభుత్వానికి తెలిపారు. (కరోనా.. 'నడక'యాతన!)

కేసు ఎత్తివేయండి
లాక్‌డౌన్‌ సం‍దర్భంగా నల్లగొండ జిల్లా వలిగొండలో నిరుపేద నాయీ బ్రాహ్మణుడిపై పోలీసులు ఐపీసీ 188 కింద కేసు పెట్టడాన్ని లింగం నాయీ ఖండించారు. ప్రజ్ఞాపురం శేఖర్‌ అనే వ్యక్తిపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసి తెలియక క్షౌరశాలలు తెరిస్తే వారికి అవగాహన కల్పించాలి గానీ, కేసులు నమోదు చేయవద్దని పోలీసులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్షురకులను బెదిరించి బలవంతంగా క్షురకర్మ చేయించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. లాక్‌డౌన్‌ ముగిసేవరకు క్షురకర్మకు దూరంగా ఉండాలని వృత్తిదారులకు ఆయన పిలుపునిచ్చారు. ఆపత్కాలంలో నాయీ బ్రాహ్మణులకు అండగా ఉంటామని, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. విలేకరుల సమావేశంలో ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్‌చంద్ర నాయీ, ఉపాధ్యక్షుడు అనంతయ్య నాయీ, కార్యదర్శి జి. శ్రీనివాస్‌ నాయీ, అడ్వకేట్‌ మసాయి రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. (కోవిడ్‌ ఎఫెక్ట్‌: వారి కోసం ‘క్రౌడ్‌ ఫండింగ్‌’)

మరిన్ని వార్తలు