సమ్మెను విరమింపజేయండి

17 Oct, 2019 13:43 IST|Sakshi

ప్రభుత్వానికి తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక డిమాండ్‌ చేసింది. 13 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసుందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని సూచించింది. ప్రభుత్వం పంతానికి పోకుండా మానవతా దృక్పథంతో వ్యవహరించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారానికి ముందుకు రావాలని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మద్దికుంట లింగం అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు గత నెల జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పనిచేసిన కాలానికి వేతనాలు చెల్లించకపోవడం దారుణమని దుయ్యబట్టారు.

ఆర్టీసీని రక్షించేందుకు కార్మికులు చేస్తున్న సమ్మె​కు సంఘీభావం ప్రకటించారు. సమ్మెతో సామాన్య ప్రజలు, పేదలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమ్మె పేరు చెప్పి ప్రైవేటు వాహనదారులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారని, విచ్చలవిడిగా తిరుతున్న ప్రైవేటు వాహనాలపై అజమాయిషీ కరువైందన్నారు. ప్రైవేటు సిబ్బందితో ఆర్టీసీ బస్సులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలన్నారు. విలేకరుల సమావేశంలో సీనియర్‌ నేత మహేష్‌చంద్ర, కార్టూనిస్ట్‌ నారూ, రమేశ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు