వరంగల్‌ కోర్టు తీర్పును స్వాగతించిన నాయీలు

8 Aug, 2019 14:41 IST|Sakshi
మద్దికుంట లింగం

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌ నగరంలో సంచలనం సృష్టించిన తొమ్మిది నెలల చిన్నారి శ్రీహిత అత్యాచారం, హత్య కేసులో వరంగల్‌ జిల్లా కోర్టు తీర్పును తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక స్వాగతించింది. నేరం జరిగిన 48రోజుల్లోనే కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించడం అభినందనీయమని ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం అన్నారు. అతి తక్కువ సమయంలోనే కేసును పరిష్కరించి, హంతకుడికి శిక్షపడేలా చేసిన పోలీసులు, న్యాయవ్యవస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీహిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు.

హామీలు అమలు చేయాలి
నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు(కేసీఆర్‌) ఇచ్చిన హామీలను ఇప్పటివరకు అమలు చేయలేదని మద్దికుంట లింగం గుర్తు చేశారు. సెలూన్లకు విద్యుత్‌, కళ్యాణకట్ట ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌పై సీఎం స్వయంగా హామీయిచ్చినా ఇంతవరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల్లో అత్యంత వెనుకబడిన నాయీబ్రాహ్మణులకు బడ్జెట్‌లో కేటాయించిన రూ.250 కోట్లు ఇప్పటివరకు మంజూరు చేయలేదని తెలిపారు. తమకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు