మద్యం షాపుల లీజు ఏడాదే

29 Aug, 2017 07:21 IST|Sakshi
మద్యం షాపుల లీజు ఏడాదే
  • ‘లైసెన్సు’ కాలాన్ని కుదించాలని ప్రభుత్వ నిర్ణయం
  • ఆరు శ్లాబుల బదులు మూడు శ్లాబుల్లో లైసెన్సు ఫీజు
  • తొలి రెండు శ్లాబుల్లోకి గ్రామీణ, పట్టణప్రాంత దుకాణాలు
  • అందుకు అనుగుణంగా ఫీజు పెంచే యోచన
  • ముఖ్యమంత్రి వద్దకు చేరిన నూతన ఎక్సైజ్‌ పాలసీ ఫైలు
  • సాక్షి, హైదరాబాద్‌
    మద్యం దుకాణాల లైసెన్సు లీజు కాలాన్ని ఏడాదికే కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాత పాలసీలో రెండేళ్లుగా ఉన్న లీజు కాలాన్ని కొత్త ఎక్సైజ్‌ పాలసీలో ఏడాదికే పరిమితం చేయనుంది. అలాగే ఆరు శ్లాబులుగా ఉన్న లైసెన్సు ఫీజును ఈసారి మూడు శ్లాబులకు కుదించాలని, మొదటి రెండు శ్లాబుల పరిధిలోకి గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణాలను తీసుకొచ్చి లైసెన్సు ఫీజు పెంచాలని యోచిస్తోంది. దుకాణం లైసెన్సుతోపాటే పర్మిట్‌ రూం ఇవ్వాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు నూతన మద్యం పాలసీకి ఒక రూపాన్ని ఇచ్చి సంబంధిత ఫైల్‌ను సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్దకు అధికారులు పంపారు. దీనిపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    డీనోటిఫై అవసరం లేకుండానే..: జాతీయ, రాష్ట్రీయ రహదారులకు 500 మీటర్ల దూరంలోపు మద్యం దుకాణాలు నిర్వహించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు ప్రభావం నుంచి హైవేలపై ఉన్న మద్యం దుకాణాలను బయటపడేసేందుకు రాష్ట్రీయ రహదారులను డీనోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లోని రహదారులకు తమ తీర్పు వర్తించదంటూ సుప్రీంకోర్టు తాజాగా స్పష్టతనిచ్చింది. ఈ తీర్పు వల్ల రాష్ట్ర హైవేలపై ఉన్న 561 మద్యం దుకాణాలకు ఇబ్బంది లేకుండా అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,144 మద్యం దుకాణాలు, 852 బార్లు నడుస్తుండగా అందులో 1,184 మద్యం దుకాణాలు జాతీయ, రాష్ట్రీయ రహదారులపై ఉన్నాయి.

    ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..
    మద్యం దుకాణాల కోసం ఈసారీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి లాటరీ ద్వారా లైసెన్సు కేటాయించనున్నారు. అయితే గతంలో ముందుగా దుకాణం లైసెన్సు కేటాయించి తరువాత రూ. 2 లక్షల ఫీజుతో పర్మిట్‌ రూమ్‌ను అనుమతించే వాళ్లు. ఈసారి లైసెన్సుతోపాటే పర్మిట్‌ రూమ్‌కు అనుమతి ఇవ్వాలనుకుంటున్నారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని ఎక్సైజ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    మొత్తం మద్యం దుకాణాలు             2,216
    గతేడాది వేలంలో పోయినవి            2,144  
    జాతీయ రహదారులపై ఉన్నవి             623
    రాష్ట్రీయ రహదారులపై ఉన్నవి            561
    సుప్రీంకోర్టు స్పష్టతతో వెసులుబాటు పొందినవి        479
     
    మొత్తం బార్లు                                                         852
    జాతీయ రహదారులపై ఉన్నవి                                265
    రాష్ట్రీయ రహదారులపై ఉన్నవి                                155
    సుప్రింకోర్టు స్పష్టతతో వెసులుబాటు పోందినవి         107

మరిన్ని వార్తలు