తెలంగాణ ‘నయాగరా’

26 Jul, 2019 14:58 IST|Sakshi

రెప్ప వేయనివ్వని సోయగాలు.. ఈ సప్త గుండాలు  

కుమురంభీం జిల్లా అడవుల్లో కనువిందు చేస్తున్న మిట్టె జలపాతం 

సాక్షి, ఆసిఫాబాద్‌: చుట్టూ అడవి.. కొండల నుంచి జాలువారే జలపాతాలు.. పాలనురుగును తలపించే నీళ్లు.. దిగువకు దూకుతున్న జల సవ్వడులు.. రెప్పకూడా వేయకుండా తనివితీరా చూడాలనిపించే ప్రకృతి సోయగాలు.. ఫొటో చూస్తుంటేనే అదిరిపోతోంది.. నిజంగా అక్కడకు వెళ్లి చూస్తే తన్మయత్వంతో మైమరచిపోవడం ఖాయం అనిపిస్తోంది కదూ! మరి ఇంతటి అందమైన.. మినీ నయాగరాలా కనిపిస్తున్న ఈ జలపాతం ఎక్కడుందో తెలుసా? అచ్చంగా మన గడ్డ మీదే..!     

చదవండి: జలపాతాల కనువిందు 

మనసు దోచే జలపాతాలు, హృదయం పులకరించే ప్రకృతి సోయగాలు చూడాలంటే ఇకపై మనం ఎక్కడికో వెళ్లక్కర్లేదు. దర్జాగా మన గడ్డపైనే వాటిని చూస్తూ తన్మయత్వంతో మైమరచిపోవచ్చు. మదిని కట్టిపడేస్తూ కనువిందు చేస్తున్న ఈ అందాలు.. మన కుమురంభీం జిల్లాలోనే ఉన్నాయి. లింగాపూర్‌ మండల సమీపంలో ఈ జలపాతాలు హోయలొలికిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. సప్తగుండాలుగా పిలిచే ఏడు జలపాతాలు మదిని పులకరింపజేస్తున్నాయి. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న రామ గుండం, సీత గుండం, లక్ష్మణ గుండం, భీమ గుండం, సవితి గుండం, చిరుతల గుండం, సప్తగుండం అనే ఏడు గుండాలను కలిపి మిట్టె జలపాతం అని పిలుస్తారు. 

ఇటీవల కురిసిన వర్షాలకు వరద చేరడంతో ఎత్తైన కొండల నుంచి జలపాతం పరవళ్లు తొక్కుతూ చూపరులను కట్టిపడేస్తోంది. కుమురంభీం జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతాన్ని గతంలో పనిచేసిన కలెక్టర్‌ చంపాలాల్‌ సందర్శించడంతో మరింత వెలుగులోకి వచ్చింది. అద్భుతమైన పర్యాటక కేంద్రంగా విరజిల్లాల్సిన ఈ ప్రదేశం.. సరైన రోడ్డు మార్గం లేకపోవడంవల్ల ప్రాచుర్యం సంతరించుకోలేకపోతోంది. ఇవే కాకుండా ఈ జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనేక జలపాతాలు ఉన్నా ఇన్నాళ్లూ అవి బాహ్య ప్రపంచానికి పరిచయం కాలేదు.

మరిన్ని వార్తలు