ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల దోపిడీకి చెక్‌!

6 Mar, 2018 02:10 IST|Sakshi

పురపాలికల్లో టెండర్లు పిలవకూడదని ప్రభుత్వ నిర్ణయం

ప్రత్యామ్నాయంగా పారిశుధ్య కార్మికులతోనే గ్రూపుల ఏర్పాటు

గ్రూపులను రిజిస్టర్‌ చేయాలని పురపాలికలకు ఆదేశం

ఒక్కో గ్రూపులో ఏడుగురు సభ్యులు..

ప్రభుత్వానికి మిగిలిపోనున్న ఏజెన్సీల కమీషన్‌

73 పురపాలికల్లోని 16 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు ఊరట

సాక్షి, హైదరాబాద్‌ : ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్ల దోపిడీకి త్వరలో బ్రేక్‌ పడనుంది. రాష్ట్రంలోని పురపాలికల్లో పని చేస్తున్న వేలాది మంది పారిశుధ్య కార్మికులకు వేతనాల చెల్లింపులతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ నిధుల విషయంలో చేతివాటం ప్రదర్శిస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్లను ఇకపై నియమించరాదని రాష్ట్ర పురపాలక శాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ఒప్పంద కాలం ముగిసిన తర్వాత కొత్త ఏజెన్సీల నియామకం కోసం టెండర్లు నిర్వహించరాదని అన్ని పురపాలికలను ఆదేశించింది.

ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల స్థానంలో పారిశుధ్య కార్మికుల సంఘాలు(సానిటేషన్‌ వర్కర్స్‌ గ్రూప్స్‌/ఎస్‌డబ్ల్యూజీ) ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కార్మిక సంఘాలను రిజిస్ట్రర్‌ చేయించి వాటి ద్వారా ప్రస్తుతం పని చేస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు వినియోగించుకోవాలని కోరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఇప్పటికే గ్రూపులను ఏర్పాటు చేసి వాటి ద్వారానే పారిశుధ్య కార్మికుల సేవలను వినియోగించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని మిగిలిన 73 పురపాలికల్లోనూ కార్మిక సంఘాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రస్థాయి సలహా సంఘం చేసిన సిఫారసుల మేరకు పురపాలక సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీని మినహాయిస్తే మిగిలిన 73 పురపాలికల్లో సుమారు 16 వేల మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పని చేస్తున్నారు. తాజా నిర్ణయంతో వీరందరికీ ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టర్ల వేధింపులు తప్పనున్నాయి.

ఒక్కో గ్రూపులో ఏడుగురు
ప్రతి ఏడుగురు పారిశుధ్య కార్మికులతో గ్రూపు ఏర్పాటు చేసి సొసైటీల రిజిస్ట్రేషన్‌ చట్టం కింద రిజిస్టర్‌ చేయాలని పురపాలక శాఖ సూచించింది. 2017 జూన్‌ నాటికి హాజరు పట్టికలో పేర్లున్న వారితోనే ఈ గ్రూపులు ఏర్పాటు చేయాలని, ఒక గ్రూపులో ఒకే కుటుంబం నుంచి ఒకరిని మించి నియమించరాదని కోరింది. సొసైటీల రిజిస్ట్రేషన్‌ విషయంలో పారిశుధ్య కార్మికులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఉద్యోగులు సహకారం అందించాలని సూచించింది. గ్రూపులోని కార్మికులందరూ ఒకే పనివేళకు చెందిన వారై ఉండాలని స్పష్టం చేసింది. కార్మికులకు జీతాలను బ్యాంకు ఖాతాల్లో వేయాలని, ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్‌ విధానంలో హాజరు నమోదు చేయాలని కోరింది. కార్మికుల ఈఎస్‌ఐ, పీఎఫ్‌ ఖాతాల్లో నిధులు జమ చేసే ప్రక్రియను నోడల్‌ ఏజెన్సీల ద్వారా జరపాలని సూచించింది.

వారంలో 6 రోజులు
గ్రూపులోని ఏడుగురు కార్మికుల్లో రోజూ ఆరుగురికి పని కల్పించడంతోపాటు ఒకరికి సెలవు ఇవ్వాలని పురపాలక శాఖ కోరింది. కార్మికుల మధ్య పరస్పర అవగాహనతో వారి అవసరాల కోసం సెలవులను మార్పు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. మరోవైపు కార్మికుల గ్రూపులకు పని అప్పగింత విషయంలో స్పష్టమైన లెక్కలు ఇచ్చింది. 60 అడుగుల వెడల్పు కలిగిన రోడ్డును 500 మీటర్ల పొడవున ఊడ్చే పనిని ఒక్కో కార్మికుడికి అప్పగించాలని కోరింది. 80 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డయితే 350 మీటర్ల పొడవున, 40 అడుగుల వెడల్పు రోడ్డయితే 750 మీటర్ల పొడవున ఊడ్చే పనిని ఒక్కొక్కరికి అప్పగించాలని తెలిపింది.

వేతన కష్టం
రాష్ట్రంలోని మునిసిపల్‌ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.11,473 వేతనం చెల్లిస్తుండగా, ఈఎస్‌ఐ, పీఎఫ్, కాంట్రాక్టర్‌ కమీషన్, సర్వీస్‌ ట్యాక్స్‌ పోగా రూ.8,300 చేతికి అందుతోంది. నగర పంచాయతీల కార్మికులకు రూ.10,091 వేతనం చెల్లిస్తుండగా, కోతలన్నీ పోగా కార్మికుల చేతికి రూ.7,300 మాత్రమే అందుతున్నాయి.

కార్మికుల వేతనాల్లో 7.5 శాతాన్ని ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలు కమీషన్‌గా పొందుతున్నాయి. దీంతో చాలీచాలని ఈ వేతనాలను పెంచాలని కార్మికులు మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల విధానాన్ని విరమించుకోవడంతో వారికి అందిస్తున్న 7.5 శాతం కమీషన్‌ పురపాలికలకు మిగిలిపోనుందని అధికార వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు