అభివృద్ధిలో తెలంగాణ అగ్రగామి

11 Jun, 2018 15:16 IST|Sakshi
రాంపూర్‌లో పాఠశాల ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి జూపల్లి  

తలకొండపల్లి(కల్వకుర్తి): దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రమని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అందరూ కంకణబద్దులు కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఆదివారం తలకొండపల్లి మండల పరిధిలోని పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

రాంపూర్‌ గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు గది ప్రారంభోత్సవంతోపాటు ప్రహరీ నిర్మాణానికి శంకుస్థాపన, గట్టుఇప్పలపల్లిలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులు, ఖానాపూర్‌ నుంచి వెంకట్రావుపేట్‌ మీదుగా గట్టుఇప్పలపల్లి వరకు ఏడు కిలోమీటర్ల మేరకు రూ. 3.60 కోట్ల బీటీరోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

అనంతరం రాంపూర్, గట్టుఇప్పలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ఉద్యమం చేయకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, సీఎం కాకుంటే ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందేవి కావన్నారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అద్భుత విజయాలను సొంతం చేసుకుందని తెలిపారు. గతంలో ఒక్క మహబూబ్‌నగర్‌ జల్లాలోనే సుమారు 1672 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు.  

రైతుబంధుతో చరిత్ర సృష్టించాం..

రైతుబంధు పథకంతో ఆత్మహత్యలు లేని తెలంగాణను నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రైతుల దృష్టి తెలంగాణపై పడిందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను వ్యవసాయంలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసి 12 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు.

త్వరలో రాష్ట్రమంతా మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందనుందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి రైతులకు బీమా పథకం అమలుకానుందన్నారు. చనిపోయిన రైతుకు రూ. 5 లక్షల బీమా సొమ్ము కేవలం పది రోజుల్లోనే అందించనున్నట్లు వివరించారు. గత పాలకులు రైతులను నట్టేట ముంచారని ఆరోపించారు. అప్పులు లేకుండా రైతు వ్యవసాయం చేయాలన్నదే కేసీఆర్‌ ఆశయమని చెప్పారు. ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

గత 4 ఏళ్ల కాలంలో రైతు సంక్షేమాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 18 వేల కోట్లు బీటీ రోడ్ల నిర్మాణానికి ఖర్చు చేశామన్నారు. అదే విధంగా ప్రతి మండల కేంద్రంలో గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.  

గ్రామాలపై హామీల వర్షం..  

రాంపూర్‌ గ్రామంలో సూర్యరావు చెరువు మరమ్మతుకు, నూతన పంచాయతీ భవనానికి, పాఠశాల ప్రహరీ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అదేవిధంగా గట్టుఇప్పలపల్లిలో బ్యాంక్‌ ఏర్పాటుతో పాటు, మహిళా సంఘాలకు రూ. 10 లక్షలతో డ్వాక్రా భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆస్పత్రిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, ఎడ్మా కిష్టారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నర్సింహ, ఎంపీపీ లక్ష్మీదేవిరఘురాం, సర్పంచ్‌లు మణెమ్మయాదయ్య, జంగమ్మమైసయ్య, ఉపసర్పంచ్‌ హరికిషన్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ రమేశ్‌యాదవ్, ఎంపీటీసీ వెంకటయ్య, తహసీల్దార్‌ ఆర్పీ జ్యోతి,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్, అర్జున్‌రావు, రైతు సమన్వయసమితి కోఆర్డినేటర్‌లు రేణురెడ్డి, దశరథ్‌నాయక్, రఘురాములు, రఘుపతిరెడ్డి, బోస్, వెంకటయ్య, కృష్ణ, మోహన్‌రెడ్డి, రాజశేఖర్, హెచ్‌ఎం కృష్ణారెడ్డి, నర్సింహ టీచర్, స్కూల్‌ చైర్‌పర్సన్‌ ఆండాలు, ఎంపీడీఓ శ్రీనివాసాచార్య, ఏఓ రాజు, గిరిజన నాయకులు హన్మానాయక్, జంగయ్య, వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు