టీఎస్‌ఆర్టీసీ జోన్లకు టీ అధికారులే బాధ్యులు

28 May, 2015 01:59 IST|Sakshi
టీఎస్‌ఆర్టీసీ జోన్లకు టీ అధికారులే బాధ్యులు

* కీలక నిర్ణయం తీసుకున్న జేఎండీ రమణారావు
* ఏపీకి చెందిన జయరావుకు ‘గ్రేటర్’ జోన్ బాధ్యతల తొలగింపు
* విభజనను వాయిదా వేసిన ఎండీ చర్యకు కౌంటర్?

 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మళ్లీ విభజన చిచ్చు రాజుకుంది. స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి చెందిన అధికారులను ఆ రాష్ట్ర ఆర్టీసీకి కేటాయిస్తూ సిబ్బంది విభజన పూర్తి చేయాల్సిన తరుణంలో దాన్ని ఎండీ సాంబశివరావు వాయిదా వేయడాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎండీ నిర్ణయానికి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ  ఆర్టీసీ జేఎండీ రమణారావు ఈడీలకు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో భౌగోళికంగా ఏపీకి చెంది ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ పరిధి లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)గా పనిచేస్తున్న జయరావు విధుల్లో  కోత పెట్టారు.
 
ఏపీఎస్ ఆర్టీసీ ఇంజనీరింగ్ విభాగం ఈడీగా పనిచేస్తున్న జయరావుకు అదనంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ బాధ్యత కూడా ఉంది. దాన్ని తొలగిస్తూ టీఎస్ ఆర్టీసీ జేఎండీ ఉత్తర్వు జారీ చేశారు. ప్రస్తుతం కరీంనగర్ ఈడీగా ఉన్న పురుషోత్తం నాయక్‌కు ఆ బాధ్యతను అదనంగా అప్పగించారు. ఇటీవలే విజయవాడ నుంచి టీఎస్‌ఆర్టీసీకి వచ్చిన ఈడీ నాగరాజుకు హైదరాబాద్ జోన్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఈ జోన్‌ను పురుషోత్తం నాయక్ పర్యవేక్షిస్తున్నారు. వెరసి తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని జోన్లకు తెలంగాణ అధికారులే ఉండేలా రమణారావు వ్యవహరించ టం విశేషం. వాస్తవానికి గురువారం నాటికి అధికారుల కేటాయింపు పూర్తి కావాలి.
 
 ఈ తరుణంలో ఆప్షన్ల అంశాన్ని తెరపైకి తెస్తూ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీకి జేఎండీగా ఉన్న రమణరావుకు ఎండీ అధికారాలను తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కట్టబెట్టింది. కానీ ఆయన ప్రమేయం లేకుండానే ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ మెమో జారీ చేయడాన్ని తెలంగాణ అధికారులు ఏకపక్ష నిర్ణయమంటున్నారు.  ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన పోలవరం ముంపు ప్రాంతానికి చెందిన జయరావు తెలంగాణలోనే పనిచేస్తానని ఆప్షన్ ఇచ్చినా ఆయన్ని తెలంగాణ జోన్ బాధ్యతల నుంచి తప్పించడం విశేషం.
 
 ఈడీ నాగరాజు మస్టర్ రోల్ క్లోజ్ చేయడంపై ఆగ్రహం
 స్థానికత ఆధారంగా తెలంగాణకు చెందిన ఈడీ నాగరాజు విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తెలంగాణ అధికారులు భగ్గుమంటున్నారు. ఇటీవలి వరకు ఆయన విజయవాడ జోన్ ఈడీగా బాధ్యతలు నిర్వహించారు. పది రోజుల క్రితం ఆ పరిధిలో జరిగిన ఓ ప్రమాద బాధితులకు ఆసుపత్రిలో చికి త్స అందించే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి రవాణామంత్రికి సమాచారం అందింది. దీనిపై ఈడీ నాగరాజును ప్రశ్నించగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాధానమిచ్చారు. కానీ ఉన్నట్టుండి ఆయన మస్టర్ రోల్‌ను క్లోజ్ చేసి టీఎస్ ఆర్టీసీకి పంపారు. ఆయన ఎలాగూ తెలంగాణకే రావాల్సి ఉంది. తాత్కాలిక విభజనలో దీన్ని ఎండీ ఖరారు చేశారు. ఆ రూపంలో పంపకుండా.. శాఖాపరమైన చర్య రూపంలో పంపటాన్ని తెలంగాణ అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాజాగా ఆయనకు హైదరాబాద్ జోన్ ఈడీ బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ జేఎండీ రమణరావు నిర్ణయం తీసుకోవటం విశేషం.

>
మరిన్ని వార్తలు