కసరత్తు పూర్తి 

29 Dec, 2018 13:12 IST|Sakshi

పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. పంచాయతీ, వార్డుల రిజర్వేషన్లు శనివారం ప్రకటించనున్నారు. రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం పంచాయతీ రిజర్వేషన్లపై కసరత్తు చేస్తోంది. కలెక్టర్‌ ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం డీపీఓ, మెదక్, తూప్రాన్, నర్సాపూర్‌ ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పంచాయతీ, వార్డు రిజర్వేషన్ల కోటాను ఖరారు చేశారు. 2011 జనాభా ప్రాతిపదికన మండల యూనిట్‌గా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ కేటగిరీలవారీగా ఖరారు చేసిన రిజర్వేషన్ల కోటాను మండలాలవారీగా కలెక్టర్‌ ముగ్గురు ఆర్డీఓలకు అందజేశారు.
 

సాక్షి, మెదక్‌ : మండల కోటాను అందుకున్న ఆర్డీఓలు శుక్రవారం మధ్యాహ్నం వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. జిల్లాలో మొత్తం 469 పంచాయతీల్లో 4086 వార్డులు ఉన్నాయి. మెదక్‌ ఆర్డీఓ వీరబ్రహ్మచారి డివిజన్‌ పరిధిలోని ఎంపీడీఓలతో సమావేశమై వార్డుల రిజర్వేషన్లను చేపట్టారు. రిజర్వేషన్‌ కోటాను అనుసరించి వార్డు రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే 2011 జనాభా ఆధారంగా మెదక్‌ డివిజన్‌ పరి«ధిలోని పది మండలాల్లో ఉన్న  231 పంచాయతీల సర్పంచ్‌ల రిజర్వేషన్లను పూర్తి చేశారు. రాత్రి 9 గంటల వరకు సర్పంచ్‌ల రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగింది. నర్సాపూర్‌ డివిజన్‌ పరిధిలోని 140 పంచాయతీల రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్‌డీఓ వెంకటేశ్వర్లు చేపట్టారు.

నర్సాపూర్‌ డివిజన్‌ పరిధిలోని ఎంపీడీఓలు రిజర్వేషన్ల ప్రక్రియలో పాల్గొన్నారు. తూప్రాన్‌డివిజన్‌ పరిధిలోని 98 పంచాయతీలకు సంబంధించిన పంచాయతీ సర్పంచ్, వార్డుల రిజర్వేషన్‌ ప్రక్రియను ఆర్డీఓ శ్యాం ప్రకాశ్‌ పర్యవేక్షణలో అధికారులు చేపట్టారు. వార్డు, పంచాయతీ రిజర్వేషన్లు పూర్తి చేసిన వెంటనే మండలాల వారిగా వివరాలను ఆర్డీఓలు కలెక్టర్‌కు అందజేశారు. అలాగే ఎంపీడీఓలు రిజర్వేషన్‌ జాబితాలను డీపీఓలకు పంపారు. ఆర్డీఓల నుంచి వచ్చిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్‌ ధర్మారెడ్డి శనివారం పరిశీలించనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆర్డీఓలు రిజర్వేషన్లు చేపట్టింది, లేనిదీ పరిశీలించి ఆ తర్వాత రిజర్వేషన్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

రిజర్వేషన్లపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయాలని ఆసక్తి ఉన్న నాయకులు రిజర్వేషన్ల వివరాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్లపై కొంత మందినాయకులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు