సర్వం సిద్ధం..

9 Jan, 2019 11:00 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: పంచాయతీ పోరు తొలిదశ ప్రారంభమైంది. రెండో రోజు నామినేషన్ల స్వీకరణ సైతం పూర్తయింది. ఎన్నికల అధికారులు పంచాయతీలు, వార్డులు వారీగా ఎన్నికల సామగ్రిని సైతం సిద్ధం చేశారు. క్లస్టర్ల వారీగా బ్యాలెట్‌ పత్రాలను సైతం ముద్రించారు. మూడు దశల్లోనూ ఎలాంటి అవకతవకలు రాకుండా జిల్లా అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిల్లాలో 4, 66, 077 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నారు.

జిల్లాలో 401 గ్రామ పంచాయతీలు, 3544 వార్డులు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి విడతలో జరగనున్న గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ సైతం సాగుతోంది. తొలివిడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో 145 గ్రామ పంచాయతీలు, 1264 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. తొలివిడతలో గ్రామ పంచాయతీలకు నామినేషన్ల స్వీకరణ నేటి (9వతేదీతో)ముగియనుంది. ఈ నెల 21న తొలి విడత పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి.

10.20 లక్షల బ్యాలెట్‌ పేపర్లు..
జిల్లాలో మూడు విడతల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా అధికార యంత్రాంగం మొత్తం 10,20,200 బ్యాలెట్‌ పేపర్లను సిద్ధం చేశారు. సర్పంచ్‌కు 5,02,200, వార్డు మెంబర్‌కు 5,18, 000లు బ్యాలెట్‌ పేపర్లను ముద్రించారు. సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు రెండు గుర్తులు, నోటాతో కూడిన బ్యాలెట్‌ పేపర్‌ నుంచి ముద్రించారు. సర్పంచ్‌ ఎన్నికల్లో 9 గుర్తులు, నోటాతో కూడిన బ్యాలెట్‌ పేపర్ల వరకు, వార్డు మెంబర్లకు ఏడు గుర్తులు, నోటాతో కూడిన బ్యాలెట్‌ వరకు ముద్రించి అందుబాటులో ఉంచారు.

4335 బ్యాలెట్‌ బాక్సులు రెడీ..
జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 4335 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధం చేశారు. వాస్తవానికి జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 401 గ్రామ పంచాయతీల పరిధిలోని 3544 వార్డులకు గాను వార్డుకొక బ్యాలెట్‌ బాక్స్‌ చొప్పున ఏర్పాటు చేశారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండేలా మరో 390 బ్యాలెట్‌ బాక్సులు రిజర్వ్‌లో ఉంచారు.

1,558 వార్డులో 100 మంది లోపు ఓటర్లు 
జిల్లాలో 4,66,077 మంది పంచాయతీ ఓటర్లుండగా అందులో 100 మంది ఓటర్లలోపు 1558 వార్డులున్నాయి. 101 నుంచి 400 వరకు ఓటర్లు ఉన్న వార్డులు 1980 వార్డులున్నాయి. 401 నుంచి పైన ఓటర్లు ఉన్న వార్డులు 16 మాత్రమే ఉన్నాయి. వార్డుల్లో తక్కువగా ఓటర్లు ఉండడంతో ప్రతి ఓటు పోటీలో నిలబడిన అభ్యర్థికి కీలకం కానుంది. దీంతో ఓటర్లకు డిమాండ్‌ పెరగనుంది. 

మరిన్ని వార్తలు